ఇప్పుడే బడులెందుకు? తెలంగాణ హైకోర్టు విస్మయం

24 Jun, 2021 04:00 IST|Sakshi

హాజరు తప్పనిసరి కాదన్న సర్కారు..

తల్లిదండ్రులు అంగీకరిస్తేనే..

పిల్లలు భౌతికదూరం పాటించగలరా? అన్న హైకోర్టు

మూడో దశ ముప్పుపై తల్లిదండ్రుల ఆందోళన అర్థం చేసుకోవాలని సూచన

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాకే మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం

ఇంత అనాలోచిత నిర్ణయమా? 
మార్గదర్శకాలు రూపొందించకుండా జూలై 1 నుంచి బడులు ప్రారంభించాలంటూ జీవో ఎలా ఇస్తారు? ఇంత అనాలోచిత నిర్ణయం ఎలా తీసుకుంటారు? పెద్దలే కరోనా నిబంధనలు పాటించట్లేదు. పిల్లలు నిబంధనలు పాటిస్తారనే నమ్మకం ఉందా? వారికి ప్రమాదం కలగకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం.
- హైకోర్టు 

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌..
భౌతిక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు. తల్లిదండ్రులు అంగీకరిస్తేనే పిల్లలు తరగతులకు హాజరుకావొచ్చు. భౌతిక తరగతులతోపాటు ఆన్‌లైన్‌ క్లాసులను కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు వారి ఇష్టానికి అనుగుణంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ తరగతుల్లో వేటికైనా హాజరు కావచ్చు. 
- విద్యాశాఖ 
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా మూడో వేవ్‌ ముప్పుపై ఆందోళన నెలకొన్న సమయంలో రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభు త్వం నిర్ణయించడం ఏమిటని హైకోర్టు విస్మ యం వ్యక్తం చేసింది. కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో అనాలోచిత, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. మెజారిటీ స్కూళ్లు చిన్న సముదా యాల్లో నడుస్తాయని.. విద్యార్థులు భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలు పాటించడం సాధ్యమేనా అని నిలదీసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించాలని.. వారం రోజుల్లో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి భౌతిక తరగతులు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది తిరుమలరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
ఆందోళనలో తల్లిదండ్రులు 
96 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు భౌతిక తరగతులను వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ ధర్మాసనానికి విన్నవించారు. కరోనా మూడోవేవ్‌ వల్ల పిల్లలకు ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. చాలా పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవని, తరగతి గదులు ఇరుకుగా ఉంటాయని, భౌతికదూరం పాటించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ఇంకా వ్యాక్సినేషన్‌ చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో భౌతిక తరగతులు ప్రారంభిస్తే.. కరోనా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భౌతిక తరగతులు ప్రారంభించాలన్న నిర్ణయమంటే.. విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమేనని మరో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనానికి విన్నవించారు. 
 
విద్యార్థుల హాజరు తప్పనిసరా? 
విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హజరయ్యారు. ‘జూలై 1 నుంచి ప్రారంభించనున్న భౌతిక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరా?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తమకు పలు సందేహాలు ఉన్నాయని, 15 నిమిషాలు సమయం ఇస్తామని, ఆలోపు విద్యా శాఖ కార్యదర్శి హాజరయ్యేలా చూడాలని ఆదేశించింది. కాసేపటి తర్వాత విచారణ మళ్లీ మొదలుకాగా.. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. భౌతిక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని, తల్లిదండ్రులు అంగీకరిస్తేనే వారి పిల్లలు తరగతులకు హాజరుకావొచ్చని ఆయన ధర్మాసనానికి వివరించారు.

ఫిబ్రవరి, మార్చిలో భౌతిక తరగతులను ప్రారంభించినప్పుడు కూడా తల్లిదండ్రుల అనుమతి తీసుకొనే తరగతులకు అనుమతించాలని ఆదేశించామని.. ఇప్పుడూ అదే తరహాలో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌ తరగతులను కూడా నిర్వహిస్తారని, విద్యార్థులు వారి ఇష్టానికి అనుగుణంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ తరగతులు వేటికైనా హాజరు కావచ్చని తెలిపారు. అయితే.. ఈ మేరకు ఏమైనా మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందించారా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఒకట్రెండు రోజుల్లో ఇస్తామని సుల్తానియా చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుంటే.. విద్యాశాఖ అధికారులు ఇంత అనాలోచితంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని నిలదీసింది. మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందించకుండా అంత హడావుడిగా జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. తల్లిదండ్రుల భయాలు, ఆందోళనను అర్థం చేసుకోవాలని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు