తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి వాయిదా

21 Jan, 2021 18:50 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా మహమ్మారికి సంబంధించిన 24 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతంలో ఉన్నంతగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆరా తీసిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఆ అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా స్ట్రెయిన్ కేసులపై రాష్ట్ర ఏజీని ప్రశ్నించగా.. 4 కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. బాధితులను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. 

ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్న కరోనా పరీక్షల వివరాలు ఫిబ్రవరి 19లోగా సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటు గతేడాది జూన్ నుంచి జరిగిన సీరం పరీక్షల వివరాలు, కరోనా నిర్ధారణ పరీక్షల తీరుపై నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా, కరోనాపై దాఖలైన 24 ప్రజా ప్రయోజనాలపై విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు మినహా మిగతా వ్యాజ్యాలన్నింటిపై విచారణ ముగిసిందని వెల్లడించింది. వీటిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు