టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు..

22 Mar, 2023 07:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టు (స్థాయి నివేదిక)ను సమరి్పంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు 3 వారాల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.

పేపర్‌ లీకేజీ కేసును సిట్‌ పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వివేక్‌ థన్కా వాదనలు వినిపించారు.  

ఇద్దరే ఉన్నారని మంత్రి ఎలా చెబుతారు.. 
‘టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. దర్యాప్తు ప్రారంభం దశలోనే ఈ కేసులో ఇద్దరే నిందితులు అని మంత్రి కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ప్రభుత్వ అత్యున్నత పదవిలో ఉన్న మంత్రి వ్యాఖ్యలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే ఉన్నారని ఆయనకు ఎలా తెలుసు?

ఆయన నియోజకవర్గంలో 20 మందికి అత్యధిక మార్కులు వచ్చాయి. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది. మంత్రి వ్యాఖ్యలు, లీకేజీలో ఆయన పీఏ పాత్ర ఉన్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో సిట్‌ స్వేచ్ఛగా దర్యాప్తు చేయలేదు. సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు బృందానికి కేసును బదిలీ చేయాలి. పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నదే మా విజ్ఞప్తి..’అని థన్కా తెలిపారు.  

సిట్‌ 9 మందిని అరెస్టు చేసింది.. 
‘కేసు ప్రారంభ దశలోనే వెంకట్, ఓయూ విద్యార్థులు కోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ వేసే అర్హత (లోకస్‌ స్టాండీ) వారికి లేదు. దర్యాప్తు అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే వారు పిటిషన్‌ వేశారు. ఇద్దరే ఉన్నారని మంత్రి చెప్పారని, అది సిట్‌ దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. కానీ సిట్‌ ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసింది. ఈ పిటిషన్‌ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వేశారు. ఈ కేసును సిట్‌ సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసు విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. లీకేజీ గురించి తెలియగానే టీఎస్‌పీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం కూడా కేసును సిట్‌కు అప్పగించింది. కాబట్టి ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. సీబీఐ విచారణ అవసరం లేదు. పిటిషన్‌ను కొట్టివేయాలి..’అని ఏజీ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. కాగా పిటిషనర్లలో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులేనని థన్కా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 
చదవండి: ఈడీ అధికారులకు కవిత సంచలన లేఖ..

మరిన్ని వార్తలు