డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌; సీజ్‌ చేసిన వాహనాలు వెనక్కు...

10 Nov, 2021 14:48 IST|Sakshi
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు (ఫైల్‌)

హైకోర్టు తీర్పుతో వాహనాలకు విముక్తి!

యజమానులకు ఇచ్చేస్తున్న పోలీసులు

హైకోర్టు తీర్పుతో ట్రాఫిక్‌ పోలీసుల చర్యలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు తెలంగాణ హైకోర్టు తీర్పు కాస్తా ఉపశమనాన్నిస్తోంది. గతంలో పట్టుబడిన వాహనాలను సీజ్‌ చేస్తూ నడిపేవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన అనంతరం చలానా చెల్లించే వారు. ఇటీవల హైకోర్టు తీర్పుతో ఈ పద్ధతికి ట్రాఫిక్‌  పోలీసులు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.


సాక్షి, బంజారాహిల్స్‌:
 ఏడాదిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలను మెల్లమెల్లగా కోర్టుకు తీర్పుకు లోబడి ఇచ్చేస్తున్నారు. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నా మద్యం సేవించి పట్టుబడ్డ వారి నుంచి వాహనాలను సీజ్‌ చేయకుండా సమీప ప్రాంతంలో ఉండే వారి బంధుమిత్రులను పిలిపించి ఆ వాహనాలను ఇచ్చి పంపిస్తున్నారు.  

► బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్‌ 31వ తేదీ వరకు 615 వాహనాలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో సీజ్‌ చేశారు.

► జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 645 వాహనాలను సీజ్‌ చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అత్యధిక వాహనాలు తిరుమలగిరి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పట్టుబడగా ఆ తర్వాత స్థానం మలక్‌పేటలో పట్టుబడ్డారు. 6,7 స్థానాల్లో వరుసగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ఉన్నాయి.

► కోర్టు తీర్పుతో సీజ్‌ చేసిన వాహనాలను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనల ప్రకారం యజమానులకు అప్పగిస్తున్నారు.

► సీజ్‌ చేసిన వాహనాలను అప్పగించే క్రమంలో మార్గదర్శకాలు అనుసరిస్తున్నారు. గత అయిదేళ్లుగా నగరంలో డ్రంక్‌ అండ్‌డ్రైవ్‌ నిర్వహిస్తుండగా ఏటా కేసులు పెరగడమే కానీ తగ్గుముఖం పట్టడం లేదు.

► వాహనదారులకు కౌన్సెలింగ్‌తో పాటు న్యాయస్థానంలో హాజరుస్తున్నారు. అయినా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఇటీవల కొంత మందిపై చార్జిషీట్‌ కూడా దాఖలు చేశారు. (చదవండి: Metro trains: ఆరుకొట్టంగనే మెట్రో రైలు)


జూబ్లీహిల్స్‌ అంటేనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు..

► పబ్‌లు, క్లబ్‌లు, ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లు జూబ్లీహిల్స్‌ పరిధిలో ఉన్నాయి. అర్ధరాత్రి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు ఈ ఏరియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి.

► శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు అయిదు వేర్వేరు చోట్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని ఆ వాహనాలను సీజ్‌ చేసేవారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి.

► జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏ నెలకు ఆ నెల కేసులు తగ్గుముఖం పట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది.

► డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మందుబాబులను కట్టడి చేయడంలో ట్రాఫిక్‌ పోలీసులు రాత్రి 4 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టాయనే చెప్పొచ్చు.(చదవండి: ఒలెక్ట్రాకు ఎంఎస్‌ఆర్‌టీసీ నుంచి 100 బస్సులకు ఆర్డరు)

► నగరంలో మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో తక్కువే.

► పబ్‌ల నుంచి యువకులు అర్ధరాత్రి మద్యం సేవించి బయటికి వస్తూ వాహనాలను నడుపుతుండటం దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో తనిఖీలు అర్ధరాత్రి వరకు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు