బంగారం కుదవ పెట్టి..బిల్లులు కడుతున్నారు

2 Jun, 2021 05:33 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు ధరలు ఎందుకు నిర్ణయించలేదు?

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు    తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహం

అధిక బిల్లులు వేసిన ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారు?

ప్రభుత్వ నివేదికపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, రోగుల బంధువులు బంగారాన్ని కుదవపెట్టి బిల్లులు కట్టాల్సి వస్తోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు ఒకే తరహాలో ధరలు నిర్ణయించాలని గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ మేరకు కొత్త జీవో జారీచేయాలని ఆదేశించినా పట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు..?’అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ధరలు నిర్ణయిస్తే ప్రయోజనం ఏంటని నిలదీసింది. ‘జీవో జారీకి సంబంధించి ప్రభుత్వానికి సూచన చేయలేదు, జీవో జారీ చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశాం. అయినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేశారంటూ ప్రైవేటు హాస్పిటల్స్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు? అధిక బిల్లులపై 79 ఫిర్యాదులు వచ్చాయని నివేదికలో పేర్కొన్నా.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయలేదు? ప్రభుత్వమే ఇంత బాధ్యతారహితంగా ఉంటే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డబ్బు ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర ఉంటే ఎలా?’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక ఇచ్చారు
‘గతంలో ఇచ్చిన జీవోను సవరించి పీపీఈ కిట్లు, సీటీ స్కాన్‌ తదితర పరీక్షలకు ధరలను నిర్ణయించాలని ఆదేశించాం. ఈ మేరకు గతంలో ఉన్న ధరలను రివైజ్‌ చేసి తాజాగా జీవో జారీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చాం. ఈ జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పాం. విపత్తు నిర్వహణ చట్టం కింద అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నాం. ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు నోడల్‌ అధికారిని నియమించాలని స్పష్టం చేశాం. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పమన్నాం. కానీ ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ సమర్పించిన నివేదికలో గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలు చేశారో లేదో ఎక్కడా పేర్కొనలేదు.

అసమగ్రంగా, అసంపూర్తిగా నివేదిక సమర్పించారు. మేము అడిగిన ఏ ప్రశ్నకు ఇందులో సమాధానం లేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే ఎలా..?’అంటూ ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌కు శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఏజీ నివేదించగా...15 రోజుల సమయం ఇచ్చినా ఇంకా గడువు కోరడం ఏంటని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వేస్తే చెల్లించాల్సిన అవసరం లేదని ఏజీ పేర్కొనగా.. కొన్ని ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేసి డబ్బు కట్టకపోతే స్వస్థత పొందినా.. రోగిని డిశ్చార్జ్‌ చేసే పరిస్థితి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నామని, గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలు, లేవనెత్తిన ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని, విచారణకు ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.

కరోనా నియంత్రణకు, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు కేటాయించిన ఔషధాలను ఆసుపత్రులకు అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని అంతకుముందు ధర్మాసనం ప్రశ్నించింది. కేటాయించిన వాటిలో ఒక్క ఇంజక్షన్‌ అందని పరిస్థితి ఉందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. కాగా ‘అధిక బిల్లులు వసూలు చేసిందంటూ గత ఏడాది విరించి ఆసుపత్రికి కరోనా చికిత్సలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఆసుపత్రిపై ఇదే తరహా ఆరోపణలు రావడంతో మళ్లీ చికిత్సలు చేయరాదని ఆదేశించారు. దీంతో లక్షలాది రూపాయలు ఫీజుగా చెల్లించిన బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి వారికి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..’అని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్, న్యాయవాదులు అర్జున్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎం.రంగయ్య తదితరులు నివేదించారు. 

చిన్నారులకు ఒకే ఆసుపత్రా?
‘కరోనా మొదటి, రెండో దశతో ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పొంచి ఉన్న మూడో దశతో రాబోయే తరం...చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. మహారాష్ట్రలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒక్క జిల్లాలోనే 8 వేల చిన్నారులు కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇంతటి ప్రమాద ఘంటికలు మోగుతున్నా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారుల వైద్యానికి నీలోఫర్‌ లాంటి ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రా? ఇందులోనూ 8 ఐసీయూ, 12 ఆక్సిజన్‌ పడకలు మాత్రమే ఉన్నాయా? ఇలా ఉంటే కరోనా బారినపడే చిన్నారులకు ఎలా చికిత్స అందిస్తారు?’అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని గతంలో ఆదేశించినా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో చర్యలు తీసుకుంటున్నామని నామమాత్రంగా మాత్రమే పేర్కొన్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇందుకోసం కొత్తగా ఎన్ని పడకలను ఏర్పాటు చేశారు? ఎంతమంది వైద్య సిబ్బందిని నియమించారు? అవసరమైన ఔషధాలను ఏమేరకు సమకూర్చుకున్నారు? ఇలాంటి వివరాలేవీ నివేదికలో పేర్కొనలేదు’అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  

మరిన్ని వార్తలు