ఆ అధికారిని జైలుకు పంపడమే కరెక్ట్‌ 

17 Mar, 2021 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టుధిక్కరణ పిటిషన్లపై అప్పీల్‌ దాఖలు చేసే కేసుల్లో సంబంధిత అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో తాము ఆదేశించినా.. వరంగల్‌ సౌత్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ (డీఎఫ్‌వో) టి.కృష్ణాగౌడ్‌ ఎందుకు హాజరు కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని ఇటువంటి అధికారులను జైలుకు పంపడమే సమంజసమని వ్యాఖ్యానించింది. ఇప్పటికే సింగిల్‌ జడ్జి విధించిన శిక్ష అమలును నిలిపివేస్తూ 2018లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరు నెలలపాటు మాత్రమే అమల్లో ఉంటాయని, గతంలో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమల్లో లేనందున కృష్ణాగౌడ్‌ను జైలుకు పంపాల్సిన అవసరముందని స్పష్టంచేసింది.

కాగా, తదుపరి విచారణకు కృష్ణాగౌడ్‌ తప్పనిసరిగా హాజరవుతారని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ విజ్ఞప్తిచేయగా ధర్మాసనం అందుకు అనుమతించింది. జూన్‌ 15న హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వరంగల్‌ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని చింతగూడ ప్రాంతంలోని కంపార్ట్‌మెంట్‌ 851లోని 30 ఎకరాలను గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అటవీ భూమి అనే పేరుతో అటవీ అధికారులు అడ్డుకుంటున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన వజ్జా రాజబాబు 2014లో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి.. పిటిషనర్ల భూముల జోలికి పోరాదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అయినా వినని అటవీ అధికారులు పిటిషనర్లను అడ్డుకోవడంతోపాటు ట్రాక్టర్‌ను సీజ్‌చేశారు. అంతేగాక వారు వంట చెరుకు, ఇతర అటవీ ఉత్పత్తులు తరలిస్తున్నారంటూ అక్రమంగా కేసు నమోదుచేశారు. దీన్ని సవాల్‌చేస్తూ పిటిషనర్లు కోర్టుధిక్కరణ కింద దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి.. బాధ్యులైన అటవీశాఖ అధికారులకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అటవీ అధికారులు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ 2018లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ అప్పీల్‌ మంగళవారం మరోసారి విచారణకు రాగా కృష్ణాగౌడ్‌ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.    

మరిన్ని వార్తలు