‘శవాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోండి’ 

4 Aug, 2020 09:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: బిల్లుకడితేనే శవాన్ని అప్పగిస్తామంటూ మొండికేసిన సన్‌షైన్‌ ఆసుపత్రి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో సన్‌షైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ సైనికుడు రామ్‌కుమార్‌ శర్మ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఆసుపత్రి చట్టబద్ధంగానే బిల్లులు వేసిందా లేదా అన్నదానిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, ఎక్కువ బిల్లులు వసూలు చేసినట్లుగా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. (తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు)

తన తండ్రి శవాన్ని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను రాఖీపౌర్ణమి సందర్భంగా సెలవు దినమైనా న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ హౌస్‌ మోషన్‌ రూపంలో సోమవారం అత్యవసరంగా విచారించారు. రామ్‌కుమార్‌శర్మను కరోనాతో గతనెల 24న సన్‌షైన్‌ ఆసుపత్రిలో చేర్చారని, ఆదివారం (2న) సాయంత్రం 4.40 ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రతాప్‌ నారాయణ్‌ సంఘీ నివేదించారు.

8 రోజులకు రూ.8.68 లక్షలు బిల్లు వేశారని, రూ.4 లక్షలు చెల్లించినా మొత్తం డబ్బు కడితేనే శవాన్ని ఇస్తామంటున్నారని తెలిపారు. ఈ మేరకు న్యాయమూర్తి స్పందిస్తూ... అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వెంటనే మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు