డిగ్రీ నచ్చేలా.. విద్యార్థులు మెచ్చేలా!

18 Aug, 2022 02:10 IST|Sakshi

విదేశీ పాఠాల మేళవింపు.. సాంకేతిక కోర్సుల జోడింపు

డిగ్రీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి యత్నాలు

విదేశీ విశ్వవిద్యాలయాలతో అధికారుల సమాలోచనలు

విద్యార్థుల్ని డిగ్రీ వైపు మళ్లించేలా విభిన్న కాంబినేషన్‌ కోర్సులు

మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన విద్యార్థులను సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మళ్ళించడం ఎలా? డిగ్రీ చేసిన వారికి ఆశాజనకమైన భవిష్యత్‌ ఇవ్వడమెలా? కార్పొరేట్‌ స్థాయికి తీసిపోనివిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడమెలా? ఇప్పుడిది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విదేశీ పాఠ్య ప్రణాళికను సైతం మేళవించి, అదనంగా సాంకేతిక విద్య కోర్సులను జోడించిన హైబ్రిడ్‌ మోడల్‌ డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులను, కాలేజీలను మళ్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

మొత్తం మీద అదనపు హంగులు అద్ది ఆకర్షణీయంగా మారిస్తే తప్ప విద్యార్థులు డిగ్రీపై దృష్టి సారించేలా చేయలేమని అనేక సర్వేలు పేర్కొంటుండటంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సైతం డిగ్రీని విభిన్నమైన కోర్సులతో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు ఆశించినంతగా సత్ఫలితాలివ్వకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు,

సగానికిపైగా సీట్లు ఖాళీగానే..
రాష్ట్రంలో 1080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,68,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల మంది ఇంటర్‌ పాసవుతున్నారు. అంటే విద్యార్థుల సంఖ్యకు మించి దాదాపు 1.68 లక్షల సీట్లు అదనంగా ఉంటున్నాయి. మరోవైపు ఇంటర్‌ పాసై డిగ్రీలో చేరుతున్నవారు సగటున 2.5 లక్షలకు మించడం లేదు. ఈ ఏడాది తొలి విడత దోస్త్‌ (డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ) కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 1.12 లక్షల మందికి మాత్రమే డిగ్రీ సీట్ల కేటాయింపు జరిగింది.

1.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా, 6 వేల మంది వరకు అసలు వెబ్‌ ఆప్షన్లే ఇవ్వలేదు. దీన్నిబట్టి చూస్తే ఆఖరి విడత వరకు కూడా 2.20 లక్షలకు మించి సీట్లు భర్తీ అయ్యే అవకాశం కన్పించడం లేదు. దీంతో మిగతా వారంతా ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వైపు దృష్టి పెట్టినట్టుగానే భావించవలసి ఉంటుంది.

ఉపాధి లభించే కోర్సులపైనే ఆసక్తి
సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనమిక్‌ స్టడీస్‌ (సెస్‌) అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలావరకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధి లభించాలని కోరుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కన్పిస్తోంది. పోస్టు–గ్రాడ్యుయేషన్, పరిశోధన విద్య వైపు వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక విద్యనో, డిగ్రీలో తక్షణ ఉపాధి లభించే కోర్సుల వైపో మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్‌లో సైతం సీఎస్‌సీ, ఇతర కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల వైపే ఎక్కువగా వెళ్తున్నారు. డిగ్రీలో కామర్స్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తాజా దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ఈ విధంగా సాధారణ డిగ్రీ కోర్సులకు డిమాండ్‌ లేకపోవడం, తక్షణ ఉపాధి లభించే డిగ్రీలపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తుండటంతో.. డిగ్రీ కోర్సులకు అదనపు హంగులు అద్దాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

ఉపాధి కల్పించేలా డిగ్రీ
డిగ్రీని సమూలంగా మార్చి ఆశాజనకంగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. బోధన ప్రణాళికలపై విదేశీ విశ్వవిద్యాలయాలతో సమాలోచనలు జరుగుతున్నాయి. బహుళజాతి కంపెనీలతో కలిసి, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్‌)

మూస విధానం మారితే ఆదరణ
విద్యా విధానంలో మూస పద్ధతులు పూర్తిగా మారాలి. ఈ దిశగా ఉస్మానియా యూనివర్సిటీ అనేక ప్రయోగాలు చేస్తోంది. ఏ సబ్జెక్టులో డిగ్రీ చేసినా, అదే సబ్జెక్టులో పీజీ చేయాలనే నిబంధనలు సరికాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం మా రింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకూ మంచి ఆదరణ లభిస్తుంది. 
– ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ (ఉప కులపతి, ఉస్మానియా వర్సిటీ)

కొత్త కాంబినేషన్లతో డిగ్రీ
మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కొత్త హంగులు అద్దుతున్నారు. గతంలో ఉన్న పది రకాల కాంబినేషన్‌ డిగ్రీ కోర్సులకు ఇప్పుడు మరిన్ని జోడించారు. బీఏలోనే 68, బీఎస్సీలో 73, బీకాంలో 13 రకాల కాంబినేషన్‌ కోర్సులు చేర్చా రు. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కంప్యూటర్‌ అప్లికేషన్‌ కోర్సులు తీసుకొచ్చారు. బీఎస్సీ గణిత, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ వంటి కాంబినేషన్‌ కోర్సులు మార్కెట్‌ అవసరాలు తీర్చేలా ఉన్నాయి.

బయోకెమెస్ట్రీ, రసాయన శాస్త్ర కోర్సులకు కాంబినేషన్‌గా కంప్యూటర్‌ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. కమ్యూనికేషన్‌ ఇంగ్లిష్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులను బీఏలో చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే తరహాలో వచ్చే ఐదేళ్ళలో మరిన్ని కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఇష్టమైన డిగ్రీని దేశ, విదేశాల్లోని ఏ యూనివర్సిటీ నుంచైనా ఆన్‌లైన్‌ ద్వారా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ విద్యార్థులు డిగ్రీ వైపు మళ్ళేందుకు తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు