అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పీహెచ్‌డీ ఉండాల్సిందే.. 

15 Jul, 2021 03:15 IST|Sakshi

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీపై ఉన్నత విద్యామండలి

ఈ ఏడాది జూన్‌ నుంచి అమలు చేస్తున్న యూజీసీ

ఆ ప్రకారమే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలు

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హతగా పీహెచ్‌డీని తప్పనిసరి చేశారు. గతంలో నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) లేదా స్టేట్‌ లెవల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (స్లెట్‌) ఉంటే సరిపోయేది. కానీ ఈసారి ఆ రెండూ ఉన్నా పీహెచ్‌డీ తప్పనిసరి చేసినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి ఈ కొత్త నిబంధనను యూజీసీ అమల్లోకి తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ ఉండాలి. ఇక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు వెళ్లాలంటే పీహెచ్‌డీతో పాటు, 8 ఏళ్ల టీచింగ్‌ అనుభవం, నిర్ణీత మేగజీన్లలో ఆర్టికల్స్‌ ముద్రితమై ఉండాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్‌ పోస్టుకు వెళ్లాలంటే 10 ఏళ్ల అనుభవం సహా మేగజీన్లలో ఆర్టికల్స్‌ ముద్రితమై మంచి స్కోర్‌ సాధించి ఉండాలి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్‌గా వెళ్లాలంటే మూడేళ్ల అనుభవంతో పాటు పైన పేర్కొన్న విధంగా అర్హతలు ఉండాలి. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయబోయే 1,195 పోస్టులను యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చెబుతోంది. అసిస్టెంట్‌ పోస్టుల భర్తీలో నెట్, స్లెట్‌ ఉన్నవారికి 10 మార్కులు వెయిటేజీ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

6 వేల మంది ఎదురుచూపులు
రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో భర్తీ చేయబోయే అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సహా ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఏకీకృత రాత పరీక్ష, ఇంటర్వూ్య ప్రకారం పోస్టులను భర్తీ చేయా లని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుందని కొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అన్ని యూనివర్సిటీల హక్కులను కాలరాసి కేంద్రీకృత పద్ధతిలో నియామకాలు చేపడితే అక్రమాలు జరగవన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో పీహెచ్‌డీ చేసి పోస్టుల కోసం ఎదురుచూసేవారు దాదాపు 6 వేల మంది ఉంటారని ఉన్నత విద్యామండలి అంచనా వేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారు దాదాపు 1,300 మంది ఉంటారని తెలుస్తోంది. మొత్తం పోస్టుల్లో దాదాపు సగం మేర ఆ కాంట్రాక్టు ఉద్యోగులే దక్కించుకునే అవకాశముంది. ఎందుకంటే వీరికి వెయిటేజీ ఉంటుంది. ఏకీకృత పరీక్ష పేరుతో కాలయాపన చేయకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం కాల రాస్తోందని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు