గ్రేటర్‌ సిటీకి తీరని ముప్పు! హైదరాబాద్‌ వరదల చరిత్ర చూస్తే బేజారే!

27 Oct, 2022 00:46 IST|Sakshi

ఏటా వరద, ముంపు బారిన పడుతున్న హైదరాబాద్‌ నగరం 

దశాబ్దాలుగా డ్రైనేజీ మాస్టర్‌ ప్లాన్‌పై వీడని నిర్లక్ష్యం 

నాలాల ప్రక్షాళన, సీవరేజీ మాస్టర్‌ప్లాన్‌ అత్యంత కీలకం 

చరిత్ర పుటల్లో తొంగిచూస్తే పలుమార్లు సిటీకి తప్పని వరద కష్టాలు 

విశ్వనగరానికి మరో మోక్షగుండం కావాల్సిందేనంటున్న నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌: పట్టుమని పది సెంటీమీటర్ల వాన కురిసిన ప్రతిసారి విశ్వనగరం మునకేస్తోంది. హైదరాబాద్‌ ప్రధాన నగరం సహా శివార్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. బండారీ లేఅవుట్, నాచారం తదితర ప్రాంతాల్లోని వారం, పదిరోజులపాటు ముంపులోనే మగ్గాల్సిన దుస్థితి నెలకొంది. చరిత్ర పుటలను తిరగేసినా ఎన్నోమార్లు నగరం వరద విలయంలో చిక్కి విలవిల్లాడినట్టు స్పష్టమవుతోంది.

ఈ దురవస్థకు చరమగీతం పాడుతూ విశ్వనగర ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. వందేళ్ల కిందట మూసీ వరదలు, నగర తాగునీటి అవసరాలు, హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ అంకురార్పణ కోసం అహరహం శ్రమించిన ప్రఖ్యాత ఇంజనీర్‌ సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో మరో మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసి హైదరాబాద్‌ నగరానికి వరదలు, విపత్తుల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

పెరుగుతున్న వరద, ముంపు సమస్యలు 
►ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా కోటిన్నరకు చేరువైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహా నగరంలో 185 చెరువులు, 1,500 కిలోమీటర్ల పొడవైన నాలా వ్యవస్థ ఉన్నాయి. ఇందులో ముఖ్య ప్రాంతాల్లో 900 కిలోమీటర్ల మేర, శివార్లలో 600 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. 

►నాలాలపై అనధికారికంగా పదివేలకుపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు బల్దియా అంచనా. వాటిని తొలగించడంలో తొలి నుంచీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. 

►నాలాల ప్రక్షాళనకు సుమారు రూ.పదివేల కోట్ల అంచనా వ్యయంతో బల్దియా సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళిక అటకెక్కింది. దీనితో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద సాఫీగా వెళ్లేదారిలేక జనావాసాలు నిండా మునుగుతున్నాయి. 

►రోజువారీగా జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 1,400 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు వెలువడుతోంది. ఇందులో జలమండలి 700 మిలియన్‌ లీటర్ల మేర శుద్ధిచేసి మూసీలోకి వదులుతోంది. 

►గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో వెలువడుతున్న మురుగునీరు ఓపెన్‌ డ్రెయిన్లు, నాలాల్లో యథేచ్ఛగా కలిసి మూసీలోకి ప్రవేశిస్తోంది. వర్షం కురిసినపుడు ప్రధాన రహదారులపై మురుగు పోటెత్తుతోంది. 

►శివారు ప్రాంతాల్లోని డ్రైనేజీలు సరిగా లేక నివాస సముదాయాల్లో మురుగు ఇళ్లలోని సెప్టిక్‌ ట్యాంకుల్లో మగ్గుతోంది. 

►రోజువారీగా గ్రేటర్‌లో వెలువడుతున్న మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రస్తుతమున్న డ్రైనేజీ పైప్‌లైన్‌ వ్యవస్థ ఏమాత్రం సరిపోవడం లేదు. 

►ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మాస్టర్‌ప్లాన్‌ అమలు కోసం సుమారు రూ.5 వేల కోట్లు అవసరం. దీనిని ప్రభుత్వం విస్మరిస్తోందన్న ఆరోపణలున్నాయి. 

ఈ ఏడాది సీజన్‌ ప్రారంభమైన జూన్‌ ఒకటి నుంచి అక్టోబర్‌ 14 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో సాధారణం కంటే 40శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో అక్టోబర్‌లో కురిసిన వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే.. 2020 అక్టోబర్‌ 14న అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. 

వరదల చరిత్ర ఇదీ
►1591 నుంచి 1908 వరకు 14సార్లు హైదరాబాద్‌ నగరం వరద ప్రవాహంలో చిక్కుకుంది. 1631, 1831, 1903 వరదలతో హైదరాబాద్‌లో భారీగా ధన, ప్రాణనష్టం 
సంభవించింది. 

►1908 నాటి వరదల్లో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి. 15వేల మంది మృతి చెందారు, 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల వరకు జనజీవనం స్తంభించింది. 

►1631లో అబ్దుల్లా కుతుబ్‌ షా కాలంలో సంభవించిన వరదలకు హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు «ధ్వంసమయ్యాయి. మూసీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి వరద బాధితులను ఆదుకున్నారు. 

►200ఏళ్ల అనంతరం 1831లో మీర్‌ ఫర్కుందా అలీఖాన్‌ నాసరుద్దౌలా పాలనా కాలంలో భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్‌ వంతెన కొట్టుకుపోయింది. వేలాది గుడిసెలు, మట్టి ఇళ్లు కూలిపోయాయి. వందల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. అప్పట్లో పురానా హవేలీలోని నాలుగో నిజాం నివాసం దాకా వరద నీరు చేరింది. నాసరుద్దౌలా వరద బాధితులకు సాయం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఒడ్డుకు దూరంగా ఇళ్లు నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

►మళ్లీ ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ ఆలీ పాలనా కాలమైన 1903 సెప్టెంబర్‌లో భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం మరోసారి అతలాకుతలమైంది. మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మూసీ ప్రమాద స్థాయిలో ప్రహహించి, భారీ నష్టం సంభవించింది. 

►తర్వాత 1968, 1984, 2007, 2016, 2019 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలతో మూసీ పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.  

మరిన్ని వార్తలు