TS: ఆకునూరులో గ్రీకువీరుడు!

24 May, 2021 13:39 IST|Sakshi

రాష్ట్రకూటుల కాలానికి చెందిన వీరగల్లుగా భావిస్తున్న పరిశోధకులు

సాక్షి, హైదరాబాద్‌: ఈ శిల్పాన్ని చూడగానే గ్రీకువీరుడిలా అనిపిస్తుంది. కానీ ఇది ఓ యోధుడి స్మృతిశిల. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామశివారులోని సోమరాజుల కుంటలో బయటపడింది. రాష్ట్రకూటుల హయాంలో 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆకునూరు ప్రాంతం అప్పట్లో ఓ యుద్ధ క్షేత్రం. రాష్ట్రకూటులకు, ఇతర సామ్రాజ్యాల రాజు లకు తరచూ యుద్ధాలు జరిగేవి. యుద్ధంలో వీరమరణం పొందిన యోధులను గుర్తు చేసుకునేలా ఇలా శిల్పాలు చెక్కి ప్రతిష్టించటం ఆనవాయితీ. వాటినే వీరగల్లులుగా పేర్కొంటారు.

ఈ వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ గుర్తించారు. దీనితోపాటు మరొక వీరగల్లు, కాలభైరవ శిల్పం, నాగముచిలింద పోలికలున్న నాగవిగ్రహం బయటపడ్డాయి. ‘మొదటి వీరగల్లుపై సర్వాభరణాలున్నాయి. కుడి చేతిలో బాణం, ఎడమచేతిలో విల్లు ఉంది. నడి నెత్తిన కొప్పు, మూపున వీరశృంఖల, నడుమున పట్టాకత్తి ఉన్నాయి.

వీరమరణం పొందాడనడానికి గుర్తు గా రెండుపక్కల అప్సరాంగణలు వింజామరలు వీస్తున్నట్టు చెక్కారు. శిల నిండా శిల్పి ప్రత్యేకతలు కనిపిస్తున్న ఇలాంటి చిత్రం అరుదు’అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రధాన ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కాగా,వీరగల్లులపై పరిశోధన జరపాల్సిన అవసరం ఉందని ఈ బృందం నిర్ణయించింది.
చదవండి: ధాన్యం తగులబెట్టి.. రోడ్డుపై బైఠాయించి ధర్నా

మరిన్ని వార్తలు