ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసు.. హైకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ

23 Nov, 2022 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్‌పీసీ కింద వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

అంతకముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు విచారణ తిరిగి ప్రారంభించింది. హైకోర్టు బెంచ్‌ ముందుకు సుప్రీంకోర్టు తీర్పు కాపీ చేరింది. బీజేపీ తరపున మహేష్‌ జెఠ్మలానీ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌  బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. సుప్రీంకోర్టు ఎక్కడా దర్యాప్తుపై స్టే ఇవ్వలేదని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు బీఎల్‌ సంతోష్‌ సహకరించడం లేదని, 41ఏ సీఆర్‌పీసీ ప్రకారం విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిపారు.

బీఎ సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడని మహేష్ జెఠ్మలానీ కోర్టుకు తెలిపారు. ఎప్పటి వరకు సమయం కావాలని హైకోర్టు  ప్రశ్నించింది. ఈ నెల 29న నివేదిక సమర్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉందని ఏజీ పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కానీ నేపథ్యంలో విచారణ ఆలస్యం అవుతుందన్నారు. తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్‌ రావు

మరిన్ని వార్తలు