కష్టాల్లో హైదరాబాద్‌ కలల మెట్రో.. అటకెక్కిన సాఫ్ట్‌లోన్‌ అంశం!

16 Nov, 2021 14:34 IST|Sakshi

మెట్రోకు సాఫ్ట్‌లోన్‌ ఎప్పుడో?

మంజూరుపై స్పష్టత కరువు

సీఎం సమీక్షించినా దక్కని వైనం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక కష్టాల్లో ఉన్న గ్రేటర్‌ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం  సాయం అందించే అంశం ప్రకటనలకే పరిమితమైంది. కోవిడ్, లాక్‌డౌన్, ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడంతో కలల మెట్రో వరుస నష్టాలను చవిచూస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మెట్రో నష్టాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇందులో సాఫ్ట్‌లోన్‌ అంశం తెరపైకి వచ్చింది. సులభ వాయిదాల్లో చెల్లించే సౌలభ్యం, తక్కువ వడ్డీరేటు సాఫ్ట్‌లోన్‌కున్న ప్రత్యేకత. మెట్రో నిర్మాణ వ్యయం పెరగడం, రుణాలపై వడ్డీ పెరగడంతో దీని మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సానుకూలంగా స్పందించింది. కానీ రుణ మంజూరు అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంలేదు గమనార్హం. 

నష్టాల బాట.. 
గ్రేటర్‌ పరిధిలో ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మూడు మార్గాల్లో 69.1 కి.మీ రూట్లో మెట్రో అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన మెట్రోకు నాటి నుంచి నేటి వరకు వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కోవిడ్‌కు ముందు మూడు రూట్లలో 4.5 లక్షల మంది జర్నీ చేయగా.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల వర్క్‌ఫ్రం హోం కారణంగా నిత్యం కనాకష్టంగా 2 నుంచి 2.5 లక్షలమంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. 

మరోవైపు మెట్రో నిర్మాణానికి నిర్మాణ సంస్థ సుమారు రూ.14,132 కోట్లు వ్యయం చేసింది. ఈమొత్తాన్ని వివిధ బ్యాంకులు,ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించింది. రుణాలపై వడ్డీ సైతం సుమారు రూ.2 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు మెట్రో నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం కూడా రూ.3 వేల కోట్ల మేర పెరిగింది.  

ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సర్కారు సాయం కోసం అర్థించింది. కానీ ఈవిషయంలో ఎలాంటి ముందడుగు పడడం లేదు. ఈ పరిస్థితుల కారణంగా మెట్రో మొదటి దశలో ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా రూట్లో 5.1 కి.మీ రూట్లో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం కానుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.  

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో సైతం ఆలస్యం? 
రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ)రూట్లో మెట్రో ఏర్పాటు ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సైతం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ రూపొందించింది. తొలిదశ మెట్రో అనుభవాల నేపథ్యంలో.. రూ.5 వేల కోట్లు అంచనా వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల సమీకరణ ఎలా అన్న అంశం కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరిన్ని వార్తలు