కుండపోత వానలు: హైదరాబాద్‌ ప్రజలకు హెచ్చరిక, పలు జిల్లాలకు కూడా..

30 Jul, 2022 07:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భారీ వర్షాల నేపథ్యంలో.. హైదరాబాద్‌ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 

తెలంగాణలో శనివారం, ఆదివారం భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ఇది వరకే హెచ్చరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకున్నంతో.. శుక్రవారం సాయంత్రం రెండు నుంచి మూడుగంటలపాటు కురిసిన వర్షాలకు.. నగరం నీట మునిగింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పాయి. 

ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లోనూ భారీ వర్షాలు ఉన్నాయని, వారాంతం కావడంతో అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. వర్షం వెలిశాక హడావిడిగా బయటకు వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని చెప్తున్నారు. 

ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించారు. వాహనదారులు జాగ్రత్తగా రోడ్లపై వెళ్లాలని, కరెంట్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. 

పలు జిల్లాలకు సూచన
తెలంగాణలో పలు జిల్లాలకు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సైతం సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలు