తాళం చెవితో పనిలేదు.. ‘సెల్ఫీ’ కొడితే స్కూటర్‌ రయ్‌ రయ్‌..

1 Dec, 2021 13:02 IST|Sakshi

తాళం చెవితో పనిలేకుండానే నడిచే ఈ–స్కూటర్‌ 

సరికొత్త మొబిలిటీ యాప్‌ ఆవిష్కరణ 

ట్రిపుల్‌ ఐటీ ఆవరణలో ఈ నెలలో అందుబాటులోకి.. 

సాక్షి, హైదరాబాద్‌: తాళం చెవితో పనిలేదు.. ఈ–స్కూటర్‌ వద్దకు వెళ్లి యాప్‌ను ఆన్‌చేసి సెల్ఫీ తీస్తే చాలు.. అది స్టార్ట్‌ అయిపోతుంది. యాప్‌ ద్వారానే స్కూటర్‌ నడిపిన తర్వాత పేమెంట్‌ కూడా చేయొచ్చు. ఈ మేరకు రూపొందించిన ‘హల’మొబిలిటీ యాప్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్‌ ద్వారా ప్రయాణం, అద్దె, చార్జింగ్‌ స్టేషన్లు తదితర సేవలను వినియోగదారులు తెలుసుకోవచ్చు.

పలు విద్యాసంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ‘ఈ స్కూటర్‌’సేవలను ఇప్పటికే ‘హల’అందిస్తోంది. తాజాగా ఆవిష్కరించిన ‘హల’మొబిలిటీ యాప్‌ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ‘ఈ స్కూటర్‌’సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. స్మార్ట్‌ బ్యాటరీతో పనిచేసే ఈ–స్కూటర్ల కోసం ట్రిపుల్‌ ఐటీ ఆవరణలో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో బ్లూ టూత్‌ కనెక్షన్, జీపీఎస్‌ వంటి టెక్నాలజీ ఉండటంతో మొబైల్‌ ఫోన్‌లోని హల మొబిలిట్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ తాళాన్ని తెరిచి ప్రయాణించొచ్చు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్సు వివరాలు క్షణాల్లో సేకరించి ‘ఈ స్కూటర్‌’పై ప్రయాణానికి అనుమతిస్తుంది. మెట్రోపాలిటన్‌ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను ‘హల’తీరుస్తుందని జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రయాణాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే 12 నెలల్లో ఆరు నగరాల్లో ‘హల’యాప్‌ ద్వారా పనిచేసే 15వేల స్కూటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదిలాఉంటే, టి హబ్‌లోని ‘ల్యాబ్‌ 32 ప్రాజెక్టు’ కింద ‘హల మొబిలిటీ యాప్‌’ పురుడుపోసుకున్నట్లు టీ హబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు