నిప్పుల కుంపటి.. జర జాగ్రత్త

1 May, 2022 03:25 IST|Sakshi

ఉగ్రరూపం దాలుస్తున్న ఉక్కబోత

మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్న వైద్యులు

చెమట రూపంలో సోడియం, పొటాషియం, క్లోరైడ్స్‌ పోకుండా చూసుకోవాలని సూచన

ఇళ్లలో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలపైనా అధిక ప్రభావం

‘సాక్షి’తో జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ప్రభుకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. మండు టెండలు, వడగాడ్పులు, ఉక్కబోత రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వీటిని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో ఎండలు మరింత ముదిరి 45 నుంచి 48 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని వాతావరణ శాఖ సైతం హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌సహా మరికొన్ని చోట్ల ఎండ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా, వడగాడ్పుల వేడి, ఉక్కబోత వంటివి జనాలను హడలెత్తిస్తున్నాయి.

రాత్రి అయినా చల్లబడని వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మే నెలలో భానుడి భగభగలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో వడదెబ్బతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మెదడు లాగినట్లు  ఉండటం వంటివి చోటుచేసుకుంటాయని పేర్కొంటున్నారు. బరువులు ఎత్తడం, ఇతర శారీరక అలసట కలిగించే పనులేవీ చేయకపోయినా చెమటలు పట్టి శరీరం నుంచి సోడియం, పొటాషియం, క్లోరైడ్స్‌ తగ్గిపోతాయని, ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

ఇళ్లలో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలపైనా అధిక ప్రభావం
వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు వారిపై అధిక ప్రభావం చూపుతాయి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుల్లో సోడియం స్థాయిలు తగ్గిపోవడం వల్ల అయోమయం, ఎటూ తోచని తీరుతోపాటు కోమాలోకి వెళ్లే అవకాశాలుంటాయి. వడగాల్పులు చెవుల్లోకి వెళ్లి కళ్లు మంటలెక్కడం, మెదడు ప్రభావితమై, ఒళ్లునొప్పులతో జ్వరమొచ్చినట్టుగా అవుతుంది.

ఆహారాన్ని అరిగించే ఎంజైమ్స్‌ పొడిబారిపోయి నీళ్ల విరేచనాలు వంటి వాటికి దారితీయవచ్చు. అందువల్ల తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది. ఆఫీసుల్లో, ఇళ్లలో ఏసీలు, కూలర్లతో 18–20 డిగ్రీల వాతావరణంలో ఉండి 40 డిగ్రీలకు పైబడిన బయటి ప్రాంతాలకు వెళ్లొద్దు. కొద్దిసమయం 30–35 డిగ్రీలున్న ప్రదేశంలో ఉండి వేడికి అలవాటు పడ్డాక బయటకు వెళ్లాలి.

ఒక్కసారిగా వాతావరణ మార్పు సంభవించే చల్లటి ప్రదేశం నుంచి వేడి ప్రాంతానికి, వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రాంతాలకు రావడం, పోవడం వంటివి చేస్తే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. ఇళ్లలోనే తాజా పండ్లరసాలు, నిమ్మకాయ నీళ్లు, ఉప్పు, చక్కెర కలిపిన పలుచటి మజ్జిగ తాగడం మంచిది. ఎలక్ట్రాల్‌ నీళ్లు, ఓఆర్‌ఎస్, ఇతర పానీయాలు తీసుకోవాలి. బయట రంగునీళ్లు, ఈగలు వాలే చెరుకురసాలు, శుభ్రత లేని పానీయాలు, ఎనర్జీ డ్రింకులు తీసుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది.     
– డాక్టర్‌ ప్రభుకుమార్‌ చల్లగాలి, జనరల్‌ ఫిజీషియన్, లైఫ్‌ మల్టీస్పెషాలిటీస్‌ క్లినిక్‌ 

మరిన్ని వార్తలు