అప్పగింతపై చెరోదారి

15 Oct, 2021 02:29 IST|Sakshi

కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై సందిగ్ధత 

శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న 6 ఔట్‌లెట్‌లు కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ఉత్తర్వులు 

తెలంగాణలోని 9 ఔట్‌లెట్‌లను స్వాధీనం చేసుకున్నప్పుడు తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని స్పష్టీకరణ 

పవర్‌హౌస్‌లు మినహా మిగతా ఔట్‌లెట్‌లు స్వాధీనం చేసేందుకు సిద్ధంగా తెలంగాణ! 

సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగానే అన్నిటిపైనా తుది నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు అంశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరస్పర భిన్న వైఖరులను అవలంబిస్తున్నాయి. గత బోర్డు సమావేశంలో తీర్మానించిన మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఉన్న 6 ఔట్‌లెట్‌లను బోర్డుకు అప్పగిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేయగా.. తెలంగాణ మాత్రం తన వైఖరిని వెల్లడించలేదు.

శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న తమ పవర్‌ హౌస్‌లను మినహాయించి మిగతా ఔట్‌లెట్‌లను అప్పగించేందుకు ప్రభుత్వ స్థాయిలో కొంత సానుకూలత కనిపిస్తున్నా...ఇదివరకే నియమించిన ఏడుగురు సభ్యుల సబ్‌కమిటీ నివేదిక ఆధారంగానే ప్రాజెక్టుల అప్పగింతపై తుది నిర్ణయం చేయనుంది. ఈ నేపథ్యంలో గెజిట్‌ అమలుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దసరా తర్వాత ప్రస్తుత పరిస్థితిని కేంద్ర జల శక్తి శాఖకు నివేదించి దాని అభిప్రాయం మేరకు కృష్ణా బోర్డు ముందుకెళ్లనుంది. 

తెలంగాణ అప్పగించాకే.. 
గోదావరిలో పెద్దవాగు, కృష్ణాలో 15 ఔట్‌లెట్‌లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బోర్డులు ఇదివరకే రెండు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల అప్పగింతకు ముందునుంచి సంసిద్ధంగానే ఉన్న ఏపీ.. తీర్మానం మేరకు శ్రీశైలం స్పిల్‌వే, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీనీవా (మల్యాల), ముచ్చిమర్రి ఎత్తిపోతలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శ్రీశైలం కుడి విద్యుత్‌ కేంద్రం, సాగర్‌ కుడికాల్వ విద్యుత్‌ కేంద్రాలను సైతం అప్పగిస్తూ ఆ రాష్ట్ర జల వనరులు, ఇంధన శాఖ కార్యదర్శులు శ్యామలరావు, నాగులపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వీటి పరిధిలో పనిచేసే 181 మంది సిబ్బందిని బోర్డు పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ కృష్ణా బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణలోని శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న 9 అవుట్‌లెట్‌లను స్వాధీనం చేసుకున్నప్పుడే..తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలనే షరతు విధించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువున ఉన్న జూరాల ప్రాజెక్టుతో పాటు దాన్నుంచి నేరుగా నీటిని తీసుకునేలా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సైతం అవి పూర్తయిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకోకపోతే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌లకు వచ్చే ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే వాటిని సైతం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. గోదావరికి సంబంధించిన పెద్దవాగుపై మాత్రం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. 

పవర్‌హౌస్‌లపై తెలంగాణ ససేమిరా  
పెద్దవాగును బోర్డుకు అప్పగించేందుకు సిధ్దంగా ఉన్న తెలంగాణ.. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులపై మాత్రం తర్జనభర్జనలు పడుతోంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఉన్న 3 పవర్‌హౌస్‌లను అప్పగించేందుకు ఏమాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. ఇవి మినహాయిస్తే మిగతా 6 ఔట్‌లెట్‌ల విషయంలో మాత్రం కొంత సానుకూలంగా ఉంది. ఈ మేరకు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నుంచి ప్రభుత్వ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ సైతం వెళ్లింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తెలుపని రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత పరిణామాలను అధ్యయనం చేసి జూరాల, శ్రీశైలం, సాగర్‌ల అపరేషన్‌ ప్రోటోకాల్‌ ముసాయిదాను నిర్దేశించేందుకు ఇప్పటికే ఈఎన్‌సీ మురళీధర్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సబ్‌ కమిటీని నియమించింది.

సబ్‌ కమిటీలో సీనియర్‌ ఇంజనీర్లు, రిటైర్డ్‌ ఇంజనీర్లు, న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 15 రోజల్లో తన నివేదికను అందించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల అనంతరం కమిటీ భేటీ కానుంది. అనంతరం తన పరిశీనలను ప్రభుత్వానికి అందజేస్తే దానిపై ప్రభుత్వ స్థాయిలో మరోమారు చర్చించాక ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం చేయనుంది. ఒకవేళ కమిటీ ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తితే.. వాటిపై స్పష్టత కోరుతూ బోర్డులు, కేంద్రానికి లేఖలు రాయనుంది. తమ అభ్యంతరాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపితేనే అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు