తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు

8 May, 2021 03:36 IST|Sakshi

సభలు, సమావేశాలు అన్నీ బంద్‌

కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు విధిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు

సామాజిక, రాజకీయ, మత, క్రీడా, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం

100 మందికి మించకుండా శుభకార్యాలు.. 20 మందికి మించకుండా అంత్యక్రియలు

రాత్రి కర్ఫ్యూ 15 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 100 మందికి మించవద్దని.. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించవద్దని స్పష్టం చేసింది. అదికూడా మాస్కులు, భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ చట్టం–2005 కింద ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలను, రాత్రి కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు భారీగాపెరుగుతున్న నేపథ్యంలో, గత నెల 23న కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

రాత్రి కర్ఫ్యూ మరో వారం పొడిగింపు
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 8వ తేదీన ఉదయం 5 గంటలతో రాత్రి కర్ఫ్యూ గడువు ముగియనుండగా.. ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిని కట్టడి చేయడానికి హైకోర్టు ఆదేశాల మేరకు.. ఏప్రిల్‌ 20 నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూను సైతం కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను సీఎస్‌ఆదేశించారు.  

చదవండి: (వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్‌ బోర్న్‌గా రూపాంతరం చెందింది)

(కరోనాతో భవిష్యత్తులో మరో పెనుముప్పు)

>
మరిన్ని వార్తలు