ఇంటర్‌ బోర్డుపై ఇంటెలిజెన్స్‌ నిఘా 

21 May, 2022 00:59 IST|Sakshi

బోర్డులో ఏం జరుగుతుందో అని ఆరా 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డ్‌ వ్యవహారాలపై ఇంటెలిజెన్స్‌ ఆరా తీస్తోంది. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, పరీక్ష పేపర్లలో వరుస తప్పిదాలు, ప్రైవేటు కాలేజీలకు ఉన్నతాధికారులు కొమ్ముగాయడం, బోర్డులో సంబంధం లేని వ్యక్తుల జోక్యంపై కొంతకాలంగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా లిఖిత పూర్వక ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో అక్కడ వాస్తవ పరిస్థితిపై నిఘా వర్గాల నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్టు సమాచారం. మొత్తం ఇంటర్‌ బోర్డు అస్తవ్యస్తంగా తయారవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖ మంత్రి దృష్టికీ వచ్చాయి. వీటికితోడు ఈసారి ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో వరుసగా తప్పులు దొర్లాయి.

హిందీభాషా ప్రశ్నపత్రం ముద్రించనే లేదు. ఇంగ్లిష్‌ నుంచి హిందీకి అనువాదం చేసే వ్యక్తులే లేరని బోర్డు చెప్పడంపైనా విమర్శలొచ్చాయి. ఇక పరీక్షల విభాగంలో కీలకమైన వ్యక్తుల నియామకం అడ్డదారిలో జరిగినట్టు కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆఖరుకు హాల్‌ టికెట్లు కూడా ముందుగా కాలేజీలకు ఇచ్చి, ఆ తర్వాతే విద్యార్థి లాగిన్‌లో ఓపెన్‌ అయ్యేలా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం ఇంటెలిజెన్స్‌ను కోరినట్టు తెలిసింది.    

మరిన్ని వార్తలు