నీట్, జేఈఈకి ప్రత్యేక శిక్షణ

27 Dec, 2022 00:41 IST|Sakshi

వేసవిలో నిర్వహణకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు

ప్రతి జిల్లా కేంద్రంలో 100 మంది కోసం శిక్షణా కేంద్రం

ఉచిత వసతి, భోజన సదుపాయం, స్టడీ మెటీరియల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందేలా పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ‘ఇంటెన్సివ్‌ రెసి­డె­న్షియల్‌ సమ్మర్‌ కోచింగ్‌’ పేరిట వేసవిలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వ­హిం­చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభు­త్వ కాలే­జీల విద్యార్థులకు కార్పొరేట్‌ కాలే­జీలకు దీ­టు­గా పైసా ఖర్చు లేకుండా శిక్షణ ఇ­వ్వా­లన్నది బోర్డు లక్ష్యమని అధికారులు చెబు­తు­న్నారు.

ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్‌ సిలబస్‌ పూర్తి చేసి, మరో వారం రివిజన్‌ చేపట్టాలని నిర్ణ­యించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి ప్రతి కాలేజీలో­నూ జేఈఈ, నీట్‌కు సంసిద్ధుల్ని చేసే ప్రక్రియను మొదలు పెడతారు. మార్చి నె­లా­ఖరుకు ఇంటర్‌ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెన్సివ్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ మొ­దలు పెడతారు. ప్రధానంగా గ్రామీణ ప్రాం­తాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ఏర్పా­ట్లు చేస్తున్నారు. ఈ కోచింగ్‌ వల్ల జాతీ­య స్థాయి పరీక్షల్లోనే కాకుండా, తెలంగాణ ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకులు పొందే వీలుందని అధికారులు వివరిస్తున్నారు. 

సీనియర్‌ లెక్చరర్లతో శిక్షణ
శిక్షణలో భాగంగా నీట్, జేఈఈకి సంబంధించిన మాదిరి ప్రశ్నాపత్రాలను ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులందరికీ అందించనున్నారు. వీటి ఆధారంగా జిల్లా స్థా­యిలో అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. వీరి­లో మంచి మార్కులు పొందిన వంద మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో బాలురు 50 మంది ఉంటే, బాలికలు 50 మంది ఉండాలని బోర్డు మార్గదర్శకాల్లో పేర్కొంది.

వార్షిక పరీక్షల అనంతరం ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అన్ని వసతులు ఉన్న చోట వీటిని నెలకొల్పుతారు. ఉచిత వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్‌ సబ్జెక్టు లెక్చరర్లతో శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు.

అయితే ప్రత్యేక కోచింగ్‌ విషయంలో ప్రభుత్వ అ«­ద్యాç­³కులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మొదటి దశ పరీక్షలు జనవరిలో, రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతా­యి. ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 1తో ముగు­స్తాయి. ఇలాంటప్పుడు ప్రత్యేక శిక్షణకు స­మ­యం ఎక్కడ ఉంటుందనే సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు రా­కపోతే ఆ వైఫల్యాలను తమ పైకి నెట్టే వీలుందని కూడా అంటున్నట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు