అంతా సక్రమంగానే చేశాం

18 Dec, 2021 02:04 IST|Sakshi

విద్యార్థులు ఆందోళనకు గురవ్వొద్దు: ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి 

సాక్షి, హైదరాబాద్‌: ఫస్టియర్‌ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డ్‌ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్‌ కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

లాక్‌డౌన్‌ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్‌ మెటీరియల్‌ను కూడా బోర్డ్‌ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.  

రీ వెరిఫికేషన్‌ ఫీజును తగ్గిస్తున్నాం... 
ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్‌ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు.    

మరిన్ని వార్తలు