అవకతవకలకు ఆస్కారం లేకుండా..నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు  

6 May, 2022 01:33 IST|Sakshi

ప్రతీ సెంటర్‌లోనూ సీసీ కెమెరాలు 

పరీక్ష కేంద్రంలో ప్రతీ కదలికను రాజధాని నుంచే పర్యవేక్షించే ఏర్పాట్లు  

ఇంటర్‌ విద్య కార్యదర్శి జలీల్‌ వెల్లడి 

నేటి నుంచి పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి జరిగే ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉండబోతున్నా యని చెప్పారు. పరీక్షల నేపథ్యంలో జలీల్‌ గురువా రం మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్‌ పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తు న్నాం. పరీక్ష కేంద్రంలో జరిగే ప్రతీ కదలి కను రాజ ధాని నుంచే పరిశీలించే ఏర్పాట్లు చేశాం. మొత్తం 1,443 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని జిల్లా, రాష్ట్ర కార్యాలయా లకు అనుసంధానం చేశాం. ఎక్కడా పేపర్‌ లీకేజీకి అస్కారం లేకుండా ఆధునిక టెక్నాలజీని వాడుతున్నాం. ఎగ్జామినర్‌ మినహా... పరీక్ష కేంద్రంలోకి ఎవరినీ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లనివ్వం. విద్యార్థులు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. ఓఎంఆర్‌ షీట్‌లో ఏమైనా సమస్యలుంటే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. తక్షణమే వాటిని పరిష్కరిస్తారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు’అని చెప్పారు. 

15 రోజుల్లో సప్లిమెంటరీ 
‘ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే మూల్యాంకనం చేపడతాం. జూన్‌ 24 కల్లా ఫలితాలు వెల్లడించాలనే సంకల్పంతో ఉన్నాం. మంచిర్యాల, నిర్మల్‌ కొత్తగా ఏర్పాటు చేసినవి కలుపుకుని 14 స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుంది. ఫలితాలు వెలువడిన 15 రోజుల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. వాటి ఫలితాలు కూడా వీలైనంత త్వరగా వెల్లడిస్తాం’అని జలీల్‌ వెల్లడించారు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: సబిత 
ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాసి, మంచి మార్కులతో పాసవ్వాలని ఇంటర్‌ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలుంటాయని, ప్రశ్నల చాయిస్‌ కూడా పెంచామని తెలిపారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వచ్చేలా ప్రణాళికబద్ధంగా వ్యహరించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు