అన్ని ప్రశ్నలూ అందులోంచే

28 Oct, 2021 03:03 IST|Sakshi

బోటనీలో వందకు వంద శాతం 

గణితం 98 శాతంపైనే సివిక్స్‌లోనూ ఇదే జోరు 

బేసిక్‌ మెటీయల్‌పై ఇంటర్‌ బోర్డ్‌ విశ్లేషణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేథమెటిక్స్, బొటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌–1 తేలికగా రాయగలిగామని చెబుతున్నారు. తాజా ప్రశ్నపత్రాలపై ఇంటర్‌ బోర్డ్‌ ఉన్నతాధికారులు విశ్లేషణ చేశారు. మొత్తంగా 98 శాతం ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ప్రాథమిక అభ్యసన దీపిక నుంచే ప్రశ్నలు వచ్చాయని అధికారులు చెప్పారు. గణితంలో 12, 13, 20 ప్రశ్నలు మాత్రమే బేసిక్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌లోంచి రాలేదని... అయితే, వాటిని చాయస్‌ కింద వదిలేసినా వంద శాతం స్కోర్‌ చేయవచ్చని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.  

ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని? 
సివిక్స్‌ (పొలిటికల్‌ సైన్స్‌): సెక్షన్‌ ఏలో 10 మార్కుల ప్రశ్నలు ఆరు ఇచ్చి మూడు రాయమన్నారు. ఇందు లో నాలుగు ప్రశ్నలు మెటీరియల్‌ నుంచి వచ్చాయి. సెక్షన్‌ బిలో ఐదు మార్కుల ప్రశ్నలు 16 ఇచ్చారు. ఇందులో 8 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. 13 ప్రశ్నలు మెటీరియల్‌లోంచే వచ్చాయి. సెక్షన్‌ సిలో రెండు మార్కుల ప్రశ్నలు 25 ఇచ్చి, 15 ప్రశ్నలు సమాధానాలు ఇవ్వమన్నారు. ఇందులో 5 మినహా అన్నీ కవర్‌ అయ్యాయి.  

గణితం: సెక్షన్‌ ఎలో రెండు మార్కుల ప్రశ్నలు 10 ఇంటికి పది మెటీరియలోంచే వచ్చాయి. సెక్షన్‌ బిలో 4 మార్కుల ప్రశ్నలు పదింటికి ఐదు రాయాలి. రెండు మినహా అన్నీ మెటీరియల్‌లోంచే వచ్చాయి. సెక్షన్‌ సిలో ఏడు మార్కుల ప్రశ్నలు తొమ్మిది ఇచ్చారు. ఇందులో అన్నీ కవర్‌ అయ్యాయి. బాటనీలో అన్ని సెక్షన్లలోనూ అన్ని ప్రశ్నలూ మెటీరియల్‌ పరిధిలోంచే వచ్చాయి.  

సమయం ఎంతో ఆదా : సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ (ఇంటర్‌ విద్య కమిషనర్‌) విద్యార్థులు అతి తక్కువ సమయంలోనే మంచి మార్కులు సాధించడానికి బేసిక్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ ఉపయోగపడుతోంది. ఇందులో మొత్తం ప్రశ్నలను వాటి సమాధానాలను క్షుణ్ణంగా చదివితే ఉత్తమ ఫలితాలు ఖాయం. ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు విజయం సాధించడానికి దోహదపడుతోంది.  

ఇది కరదీపికే : ఉడిత్యాల రమణారావు (రీడర్‌ విద్యా పరిశోధనా విభాగం, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌) ప్రాథమిక అభ్యసన దీపిక విద్యార్థులకు కరదీపికగా ఉపయోగపడుతోంది. వీటిని అనుసరించిన ప్రతీ ఒక్కరూ మంచి స్కోర్‌ చేయవచ్చని సబ్జెక్టు పరీక్షలు రుజువు చేశాయి. బేసిక్‌ మెటీరియల్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకుని అనుసరిస్తే రాబోయే పరీక్షల్లో విజయం తథ్యం. 

మరిన్ని వార్తలు