తెలంగాణ: వెబ్‌సైట్‌లో ఇంటర్‌ మెమోలు 

2 Jul, 2021 13:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో పొందిపర్చినట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌ తెలిపారు. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. మెమోల్లో సందేహాలుంటే కాలేజీల ప్రిన్సిపల్, మెయిల్‌ (helpdeskie@telangana.gov.in) లేదా వెబ్‌సైట్‌ (http://bigrs.telangana.gov.in/) ద్వారా ఈ నెల 10లోపు సంప్రదించాలన్నారు. 

సెప్టెంబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు 
సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ ఒకటి నుంచి డిగ్రీ(యూజీ) తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.


ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌మిట్టల్, ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు పాల్గొన్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో బోధన పనిదినాలను 180 రోజులుగా అధికారులు నిర్ణయించారు. మొదటి సెమిస్టర్‌కు 90 రోజులు, రెండో సెమిస్టర్‌కు 90 రోజుల పాటు బోధన, అభ్యసన కార్యక్రమాలు సాగుతాయి. వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరిలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు, జూన్‌/జూలైలో రెండో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.   

మరిన్ని వార్తలు