తెలంగాణలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

15 Feb, 2023 04:43 IST|Sakshi

2,201 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు 

ప్రైవేటుతో మిలాఖత్‌ అయితే చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా బుధ­వారం నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్‌ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరి ప్రైవేటు కాలేజీలతో లావాదేవీలు జరిపితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎప్పటికప్పుడు పరీక్షలపై సమాచారం తెప్పించుకుంటుందని, విద్యార్థులు కూడా సమస్య ఉంటే తక్షణమే తెలియ జేసేలా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని మిట్టల్‌ తెలిపారు. కేవలం విద్యార్థులకుకలిగే అసౌకర్యాలను అప్పటిక­ప్పు­డే పరిష్కరించేందుకు అన్ని జిల్లాల్లో యంత్రాంగం పని చేస్తుందని స్పష్టం చేశారు. 

ప్రాక్టికల్స్‌కు 3,65,931 విద్యార్థులు
రాష్ట్ర వ్యాప్తంగా 3,65,931 మంది ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నారు. వీరిలో 94,573 మంది ఒకేషనల్‌ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 2,201 ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించాలని గత కొన్నేళ్లుగా డిమాండ్‌ వస్తోంది. కానీ ఈ ఏడాది వరకూ విద్యార్థి చదివే కాలేజీల్లోనే నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

జంబ్లింగ్‌ లేకపోవడం వల్ల ప్రైవేటు కాలేజీలు ప్రాక్టికల్స్‌ నిర్వహించకుండా, ఇన్విజిలేటర్లను ప్రభావితం చేసి, ఎక్కువ మార్కులు వేయించుకుంటున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి. ఈ ఏడాది ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని ఇంటర్‌బోర్డ్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇన్విజిలేటర్ల ఎంపికలోనూ ట్రాక్‌ రికార్డును పరిశీలించి మరీ ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు 
విద్యార్థులను ఏ కాలేజీ అయినా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ సమస్య తలెత్తినా విద్యార్థులు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌లోని కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేయొచ్చు. తక్షణమే స్పందిస్తాం. విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపాళ్ల సందేహాలను నివృత్తిచేసేందుకు ఈ కంట్రోల్‌ రూంను వాడుకోవచ్చు. 040 –24600110 ఫోన్‌నెంబర్‌తో పాటు,  helpdesk-ie@telangana.gov.in ను సంప్రదిస్తే సమస్యను తక్షణమే పరిష్కరిస్తాం. 
– జయప్రదాభాయ్‌ (కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్, ఇంటర్‌ బోర్డ్‌)  

మరిన్ని వార్తలు