ఊపిరి ఆగింది.. ఉత్తీర్ణతలో మెరిసింది

29 Jun, 2022 01:06 IST|Sakshi

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా రాజేశ్వరి 

గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి 

గద్వాల: బాగా చదివి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని కలలు కన్న ఆ విద్యార్థిని.. ఇంటర్‌ పరీక్ష రాసి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది.. కానీ ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన నల్లన్న కుమార్తె రాజేశ్వరి (18) జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్‌ చదివింది.

ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మే 19న కుమార్తె రాజేశ్వరిని ఆమె తండ్రి బైక్‌పై ఎక్కించుకుని గద్వాల నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాగా, మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాజేశ్వరి ఎంపీసీలో 867 మార్కులు సాధించి జిల్లాలోని కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. ఇంటర్‌లో రాజేశ్వరి ప్రతిభను గుర్తు చేసుకుని అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. 

మరిన్ని వార్తలు