మూడవ రోజు ముమ్మరంగా..

21 Dec, 2021 02:19 IST|Sakshi
ఇంటర్మీడియట్‌ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు 

ఇంటర్‌ బోర్డు ఎదుట విద్యార్థుల ధర్నా

మద్దతుగా ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన

నాంపల్లి/ ఉస్మానియా యూనివర్సిటీ: ఇంటర్‌ పరీక్షా ఫలితాల రగడ కొనసాగుతోంది. మూడవ రోజు కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు ఎదుట ఫెయిలై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎంజే రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం నుంచే బోర్డు కార్యాలయం గేట్లు మూసివేయడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించి వారు నిరసనలు వ్యక్తం చేశారు.

దీనికి తోడు సోమవారం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు జాతీయ క్యాంపెయిన్‌ శిక్షా బచావో–దేశ్‌ బచావో కార్యక్రమంలో భాగంగా ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు.

గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఇంటర్మీడియట్‌ బోర్డుకు వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులను, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు దొరికినవారిని దొరికినట్టుగా వ్యాన్‌లో ఎక్కించి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు.

90 మంది ఆందోళనకారులను బేగంబజార్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

వాహనాల అద్దాలు ధ్వంసం.. 
కాగా బోర్డు కార్యాలయానికి తరలివెళ్లే క్రమంలో కొందరు యువకులు ట్రాఫిక్‌లో రెచ్చిపోయారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారుల చేతిలో రెండు ఆటోలు, రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.  

రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు బంద్‌: ఏబీవీపీ 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ కాలేజీలను బంద్‌ చేయనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు