‘బిహార్‌’.. హాట్‌హాట్‌..

4 Mar, 2022 04:19 IST|Sakshi

ఐఏఎస్, ఐపీఎస్‌లపై వివాదాస్పదమవుతున్న రేవంత్‌ వ్యాఖ్యలు

బిహార్‌ బ్యాచ్‌కు అందలం అంటూ కొద్దిరోజులుగా దాడి 

సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ సర్కారు లక్ష్యంగా అధికారులపై విమర్శలు 

తీవ్రంగా ఖండించిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల సంఘాలు 

బాధ్యతారహితంగా వ్యాఖ్యానిస్తున్నారన్న డీజీపీ మహేందర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: పొలిటికల్‌ వర్సెస్‌ పోలీస్‌.. ఇది కొత్తదేమీ కాదు కానీ తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఐఏఎస్, ఐపీఎస్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యంగా బిహారీ బ్యాచ్‌ అంటూ రాష్ట్రంలోని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి వారం రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

డీజీపీ మహేందర్‌ రెడ్డీ.. రాజీనామా చేసి కేసీఆర్‌ ముఖాన కొట్టు అన్న వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల అసోసియేషన్లు దీటుగానే స్పందించాయి. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం బుధవారమే తీవ్రంగా ఖండించింది.

ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి గురువారం సంబంధిత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు ఇచ్చిన కీలక పోస్టింగ్‌లపై రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదురుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పదోన్నతి పొందిన ఐపీఎస్‌ అధికారులు ఏళ్ల తరబడి ఒకే కుర్చీలో కూర్చోవడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్‌ ఆ లేఖలో సూచించారు. దీనిపై తాజాగా ఐపీఎస్‌ అధికారుల సంఘం స్పందించింది. 

ఐఏఎస్, ఐపీఎస్‌ పోస్టింగుల్లో పక్షపాత వైఖరి
తెలంగాణలో బిహార్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు కీలక బాధ్యతలతో పాటు కీలకమైన విభాగాలను కేటాయించ డంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆ విభాగాలకు అధిపతులుగా పనిచేయడం వల్ల అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల పోస్టింగులపై పక్షపాత వైఖరి వీడాలంటూ గురువారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్‌లు, 139 మంది ఐపీఎస్‌ అధికారులుండగా ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శి నుంచి ఇన్‌చార్జి డీజీపీ వరకు  బిహార్‌ అధికారులనే ఇవ్వడం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఎందుకు లూప్‌లైన్‌లో పెడుతున్నారో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

రేవంత్‌ వ్యాఖ్యలపై ఐపీఎస్‌ల ఆగ్రహం 
రేవంత్‌రెడ్డి చేసిన బిహార్‌ బ్యాచ్‌ వ్యాఖ్యలను రాష్ట్ర ఐపీఎస్‌ అధికారుల సంఘం గురువారం తీవ్రంగా ఖండించింది. ఆలిండియా సర్వీసు రూల్స్‌ తెలియకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించింది. అఖిల భారత సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం జరిగే అధికారుల కేటాయింపులపై వివాదాస్పదంగా మాట్లాడటం సరైంది కాదని పేర్కొంది.

పోస్టింగ్‌ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణతో కూడుకున్నదని  కూడా స్పష్టం చేసింది. డీజీపీ మహేందర్‌రెడ్డి బలవంతంగా సెలవులో వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, బిహార్‌కు చెందిన ఐపీఎస్‌లను డీజీపీ చేసేందుకే ఇలా చేశారని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసోసియేçషన్‌ తీవ్రంగా ఖండించింది. మహేందర్‌రెడ్డి ఇంట్లో జారిపడటంతో డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి కోసం మెడికల్‌ లీవులో వెళ్లారని వివరించింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం అధికారుల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రాల వారీగా విభజించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. 

బలవంతపు సెలవు నిజం కాదు: డీజీపీ 
తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందం టూ ఎంపీ రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్త వం కాదని డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంట్లో జారిపడిన సంఘటనలో ఎడమ భుజంపైన ఎముకకు మూడు చోట్ల హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌ జరిగిందని తెలిపారు. లోపలి గాయం మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని వివరించారు.

వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందం టూ తప్పుడు, బాధ్యతా రహిత ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఒక పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని, తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీ వ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒక ఉన్నత స్థాయి, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్‌ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమని, ప్రభుత్వంపై అపో హలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు