Rythubandhu: రైతుబంధు అక్రమార్కులకు షాక్‌.. రూ. 300 కోట్లు ఆదా

5 Jul, 2021 01:38 IST|Sakshi

ప్రాజెక్టుల కింద సేకరించిన భూముల లెక్కలు తేల్చిన సర్కారు

అక్రమంగా రైతు బంధు సాయం పొందుతున్న వారికి షాక్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూముల బదలాయింపు జరగకపోవడంతో, రైతుల పేరిట దర్జాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం తీసుకుంటున్న అక్రమార్కులకు షాక్‌ తగిలింది. భూముల లెక్కలు పక్కాగా తేలడంతో, ప్రాజెక్టుల కిందికి వచ్చే సుమారు లక్షా యాభై వేల ఎకరాల భూమిని ఇరిగేషన్‌ శాఖ స్వాధీనం చేసుకుంది.

మ్యుటేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆర్థిక భారం తగ్గింది. అక్రమార్కులకు ఏటా కనీసంగా రూ.300 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రాజెక్టుల ముంపు భూములతో పాటు, గుట్టలకు, ఎప్పుడో ఏర్పడిన కాలనీల భూములకు సైతం కొందరు అక్రమార్కులు.. రైతుల పేరిట ‘రైతుబంధు’ సాయం పొందుతుండటంపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. 

ఏడాదిగా కసరత్తు..ఎట్టకేలకు కొలిక్కి
రాష్ట్రంలో వివిధ సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, వాటిల్లో కబ్జాకు గురైన భూములు, మ్యుటేషన్‌ జరగని భూముల వివరాలు తేల్చాలని గత ఏడాది  కేసీఆర్‌ ఇరిగేషన్‌ శాఖను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇన్వెంటరీ (ఆస్తుల జాబితా) పేరుతో శాఖ ఆస్తులు, భూముల వివరాలు సేకరించారు. ఇందులో భాగంగానే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, బీమా, నెట్టెంపాడు, కాళేశ్వరంతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న భూముల వివరాలు సేకరించారు. ఆయా భూముల నిమిత్తం రైతులకు పరిహారం అందజేసినా, మ్యుటేషన్‌ కాని కారణంగా వాటిని భూ యజమానులే అనుభవిస్తున్నారని, రైతుబంధు  సైతం పొందుతున్నారని గుర్తించారు. అలాగే కొన్నిచోట్ల ముంపులో ఉన్న భూములకు  కొందరు అక్రమార్కులు పెట్టుబడి సాయం పొంతున్నారని తేల్చారు.

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూములు మ్యుటేషన్‌ కాలేదని గుర్తించిన సాగునీటి శాఖ, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయాల్లో రికార్డుల ఆధారంగా ఆ భూముల వివరాలను బయటకు తీసింది. భారీ ప్రాజెక్టుల కింద 6.19 లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 76 వేల ఎకరాలు, చిన్నతరహా ప్రాజెక్టుల కింద 5.84 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 12.79 లక్షల ఎకరాలు శాఖకు చెందినవిగా గుర్తించింది. ఇందులో సుమారు 1.50 లక్షల ఎకరాల భూమి మ్యుటేషన్‌ జరగలేదని గుర్తించింది.

వీటిల్లో ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ స్టేజ్‌–1లో సుమారు 10,600 ఎకరాలు, స్టేజ్‌–2లో 6,300 ఎకరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో 7,170 ఎకరాలు, ప్రాణహితలో 5 వేలు, వట్టివాగులో 740, సత్నాలలో 730, బీమాలో 425 ఎకరాలు, నెట్టెంపాడులో 2,700 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 22 వేలు, వరద కాల్వ పరిధిలో 4,500, మిడ్‌మానేరులో 2వేల ఎకరాల మేర  మ్యుటేషన్‌ కాలేదని  గుర్తించారు. ఈ భూములకు అక్రమార్కులు రైతుబంధు  పొందుతున్నారని తేల్చారు. ఇటీవల ఈ భూముల తిరిగి స్వాధీనంపై  సమావేశాలు నిర్వహించి, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ భూములను శాఖ పేరుపై బదలాయించారు. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.300 కోట్ల మేర రైతుబంధు భారం తగ్గుతుందని  లెక్కగట్టారు.  

మరిన్ని వార్తలు