అ‘ధనం’ ఇచ్చినా అందుకోలేదు..!

6 Sep, 2020 03:28 IST|Sakshi

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అదనపు చెల్లింపులు చేసినా పూర్తికాని పనులు 

86 ప్యాకేజీ పనుల్లో 61 ప్యాకేజీల పనులు ఎక్కడివక్కడే 

భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్, బిల్లుల చెల్లింపుల జాప్యంతో ఆగిన పనులు 

ఈ ప్యాకేజీల గడువు మరో 6 నెలల నుంచి రెండేళ్లు పెంచేలా ప్రభుత్వానికి వినతులు 

కేబినెట్‌ ఆమోదం కోసం నివేదిక పంపిన ఇరిగేషన్‌ శాఖ

 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు ధరలు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ఇంతవరకు అవి పూర్తి కాలేదు. 16 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోని 86 ప్యాకేజీల పనులకు అదనపు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సుముఖం చూపినా ఇప్పటివరకు జరగని భూసేకరణ, సహాయ పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్‌), బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా 61 ప్యాకేజీల పనులు ఐదేళ్లుగా పూర్తి కాలేదు. మరో 15 వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేస్తే కానీ ఈ పనులు పూర్తయి మరో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందదు. ఈ దృష్ట్యా ఈ పనుల గడువును మరో 6 నెలల నుంచి రెండేళ్లు పెంచాల ని ఇరిగేషన్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 

ఐదేళ్లుగా ఎక్కడికక్కడే.. 
జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు వివిధ కారణాల రీత్యా జాప్యం జరగడంతో పాత ధరల ప్రకారం పనులు కొనసాగించలేమని కాంట్రాక్టు ఏజెన్సీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పెరిగిన సిమెంట్, కాంక్రీట్, స్టీలు ధరలకు అనుగుణంగా కొత్త ధరలు చెల్లించేందుకు ప్రభుత్వం 2015లో జీవో–146 వెలువరించింది. అనంతరం 2017లో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రాజెక్టుల్లో ఐబీఎం అంచనాలకు అదనంగా కొత్త కాంక్రీటు నిర్మాణాలు, అదనపు నిర్మాణాలు, లైనింగ్‌ పనులు చేరితే ఆ పనులకు అనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు. ఈ జీవోల మేరకు 2013 ఏప్రిల్‌ తర్వాత నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని ప్యాకేజీల పనులకు జీవో–146 అమలు చేస్తున్నారు.

మొత్తంగా 111 ప్యాకేజీల పనులను దీని కింద చేర్చారు. తర్వాత ఇందులో కొన్నింటిని తొలగించి 86 ప్యాకేజీలకు జీవో వర్తింపచేశారు. రూ.19 వేల కోట్ల విలువైన ఈ ప్యాకేజీల పరిధిలో పనులు పూర్తి చేయాలంటే 45 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ చాలా ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తి కాలేదు. ముఖ్యంగా బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజీ–2 వంటి పథకాల్లో ఇంకా భూ సేకరణ పూర్తి కాలేదు. ఇంకా 15 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ జరగాల్సి ఉంది. కొన్ని చోట్ల ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తికాక కోర్టు కేసుల నేపథ్యంలో పనులు ముందుకు కదలడం లేదు.

కొన్ని ప్యాకేజీల పరిధిలో చాలాకాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీలు పనులు చేయడం లేదు. మరికొన్ని ప్యాకేజీల్లో ఏజెన్సీలు దివాలా తీయడంతోనూ పనులు ఆగిపోయాయి. దీంతో మరో రూ.3,500 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేనే మరో 10 లక్షల ఎకరాల మేర ఆయకట్టు వృద్ధిలోకి వస్తుంది. ఇప్పటికే ఈ ప్యాకేజీల గడువును 2007–08 నుంచి 5 నుంచి 10 సార్లకు పైగా పొడిగించగా, ఇప్పుడు మళ్లీ వీటి గడువును 6 నెలల నుంచి రెండేళ్ల వరకు పొడిగించాలని ఇరిగేషన్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో ఆ ఏజెన్సీలు కొన్నేళ్లపాటు ఎలాంటి పనులు చేపట్టకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు