శ్రీశైలం జలాశయం ఖాళీ! 

17 Feb, 2023 02:24 IST|Sakshi

కనీస నీటిమట్టానికి దిగువన నిల్వలు 

ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు  

ఇప్పుడు మిగిలింది 51 టీఎంసీల నిల్వలే 830 అడుగులకు పడిపోయిన నీటి మట్టం 

ఏపీ, తెలంగాణతో తక్షణమే విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయించండి 

కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖ 

నిల్వ జలాల పంపిణీపై నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా సాగునీరు, విద్యుదుత్పత్తి అవసరాలకు జలాశయం నుంచి నీళ్లను తరలించడంతో జలాశయంలో నిల్వలు కనీస నీటి మట్టానికి దిగువన పడిపోయాయి. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, గురువారం నాటికి కేవలం 51.92 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలాయి.

జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. సాగునీటి అవసరాలకు 854 అడుగులు, విద్యుదుత్పత్తి అవసరాలకు 834 అడుగుల కనీస నీటి మట్టం(ఎండీడీఎల్‌) ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 830 అడుగులకు పడిపోయింది. సాగునీటి, తాగునీటి అవసరాల పరిరక్షణ కోసం తక్షణమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసేలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి లేఖ రాశారు.  

నిల్వల్లో ఏపీకి మిగిలింది 13 టీఎంసీలే ! 
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 932.07 టీఎంసీల జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే 725.51 టీఎంసీలను రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. మొత్తం లభ్యత జలాల్లో తాత్కాలిక కేటాయింపుల నిష్పత్తి 66: 34 ప్రకారం ఏపీకి 615.17 టీఎంసీలు, తెలంగాణకు 316.90 టీఎంసీల వాటా ఉంది.

ఇప్పటికే ఏపీ 542.45 టీఎంసీలను వాడుకోగా, ఆ రాష్ట్రం పరిధిలోని ఇతర జలాశయాల్లో నిల్వ ఉన్న 59.68 టీఎంసీల కృష్ణా జలాలను కలుపుకుని ఆ రాష్ట్రం మొత్తం 602.13 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. తెలంగాణ 183.05 టీఎంసీలను వాడుకోగా, ఇక్కడి ఇతర జలాశయాల్లోని 10.2 టీఎంసీల నిల్వలు కలిపి మొత్తం 193.26 టీఎంసీలను వాడుకున్నట్టు అయింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌ జలాశయాల్లో 136.67 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, అందులో ఏపీకి 13.03 టీఎంసీలు, తెలంగాణకు 123.63 టీఎంసీల కోటా ఉందని తెలంగాణ పేర్కొంటోంది. 

కల్వకుర్తి ఎత్తిపోతలకు కష్టకాలమే ! 
శ్రీశైలం జలాశయంలో 800.52 అడుగుల కనీస నీటి మట్టం ఉంటేనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2.38లక్షల ఎకరాల ఆయటకట్టుకు సాగునీటితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు తాగునీటి సరఫరాకు వీలు కానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సాగునీటి అవసరాలకు 13.6 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 4.40 టీఎంసీలు కలిపి మొత్తం 18టీఎంసీలు అవసరం.

ప్రస్తుతం జలాశయంలో 51టీఎంసీలే మిగిలి ఉండగా, రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి కొనసాగిస్తుండడంతో నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలను పరిరక్షించడానికి తక్షణమే రెండు రాష్ట్రాలతో జలవిద్యుత్‌ ఉత్పత్తిని నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. గతేడాది శ్రీశైలం జలాశయంలో నిల్వలు డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా వేసవి తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం జలాశయంలో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీళ్లను ఎత్తిపోయాల్సి వచ్చింది.  

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ 
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీలో కృష్ణా బోర్డు కన్వీనర్‌తో పాటు ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలు పాల్గొననున్నారు. రబీ ఆయకట్టుతో పాటు వేసవి తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. 

మరిన్ని వార్తలు