Telangana Irrigation Department: ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర నీటిపారుదల యంత్రాంగం

6 Aug, 2021 02:28 IST|Sakshi

గెజిట్‌ అమలుకు కృష్ణా, గోదావరి బోర్డుల ఒత్తిడి

వరుస లేఖలు.. సమాచార సేకరణ.. భేటీలు

మరోవైపు కోర్టు కేసులు.. పార్లమెంటులో ప్రశ్నలు

రుణ సంస్థల ఆరా.. ఆర్టీఐలో అర్జీలు

వివరాల సమర్పణ, నివేదికల తయారీలో అధికారులు నిమగ్నం.. తాజాగా పలు సందేహాలతో బీహెచ్‌ఈఎల్‌ లేఖ!

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు విషయంలో బోర్డులు పెడుతున్న తొందర, ప్రాజెక్టులు, సంబంధిత పరిణామాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గెజిట్‌ వెలువడిన మరుసటి రోజునుంచే దాని అమలుపై కార్యాచరణ మొదలు పెట్టాల్సిందిగా బోర్డులు లేఖల మీద లేఖలు రాయడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు కోరుతున్నాయి. వీటిపై చర్చించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. బోర్డులు కోరుతున్న ప్రతి సమాచారం సున్నితమైన కీలక అంశాలకు సంబంధించినది కావ డంతో, అధికారులు ప్రతి విషయాన్నీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయవాదులతో చర్చించి ఖరారు చేయాల్సి వస్తోంది. మరోపక్క కోర్టులు, ట్రిబ్యునల్‌ కేసుల విచారణకు వాదనలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయాల్సి ఉండటంతో తెలంగాణ ఇరిగేషన్‌ శాఖకు ఊపిరి సలపడం లేదు.

లేఖాస్త్రాలతో పెరుగుతున్న ఒత్తిడి
గత నెల 16న గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిందే ఆలస్యం.. బోర్డులు వీటి అమలుకు పూనుకున్నాయి. నోటిఫికేషన్‌ వెలువడిన మరుసటి రోజే.. అందులోని అంశాల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరాయి. ఆ తర్వాత బోర్డులకు నిధులు విడుదలపై లేఖలు రాశాయి. ఆ వెంటనే రాష్ట్రాల్లో ఆమోదం లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ లేఖలు రాశాయి. ఆ మరుసటి రోజే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమాచారంతో రెండు లేఖలు, ఆ వెంటనే కమిటీ భేటీని నిర్వహిస్తామంటూ మరో రెండు లేఖాస్త్రాలు సంధించాయి. ఇదే క్రమంలో ఈనెల 3న కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ గైర్హాజరు కాగా, ఏపీ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఒక్కో అంశంపై అభిప్రాయాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, 9న పూర్తి స్థాయి భేటీ నిర్వహిస్తామని రెండు బోర్డులు తెలంగాణకు లేఖలు రాశాయి.

ఇలావుండగా 9వ తేదీనే కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరగనుంది. ఏ కారణాలతో పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నారో తెలంగాణ కోర్టుకు వివరించాల్సి ఉంది. అదే రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ సైతం విచారణకు రానుంది. ఇక్కడ తెలంగాణ తన వాదనలు వినిపించాల్సి ఉంది. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి రుణాలు, గెజిట్‌తో ఏర్పడే పరిణామాలపై పార్లమెంట్‌లో వరుస ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేవని చెబుతున్న గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ల రుణాలపై ఇప్పటికే ప్రశ్నలు లిస్ట్‌ అయ్యాయి. ఈ ప్రశ్నలపై కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ట్ర ఇరిగేషన్‌ ఇంజనీర్ల నుంచి సమాధానాలు కోరుతోంది. మరోపక్క ప్రాజెక్టుల అనుమతులు, వాటిపై ఖర్చు చేస్తున్న నిధులపై సమాచారం కోరుతూ కుప్పలు కుప్పలుగా ఆర్టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. ఇంకోపక్క రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఇతర రుణ సంస్థలన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులు, వీటికి అనుమతుల సాధనలో రాష్ట్రానికి ఉన్న ప్రణాళికపై వరుస లేఖలు రాస్తున్నాయి. 

నాలుగురోజులుగా తలమునకలు
ఇలా కోర్టు కేసులు, కృష్ణా, గోదావరి బోర్డుల భేటీలు, వాటికి వివరాల సమర్పణ, లేఖలకు సమాధానాలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయడం తదితర పనుల్లో రాష్ట్ర ఇరిగేషన్‌ ఇంజనీర్లు గడిచిన నాలుగు రోజులుగా తల మునకలుగా ఉన్నారు. ఓవైపు న్యాయవాదులతో చర్చిస్తూనే మరోవైపు అవసరమైన నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కోర్టు కేసులు, తదితర అంశాలపై రిటైర్ట్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచందర్‌రావులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

పంపుల సరఫరా చేస్తే డబ్బులిస్తారా?
తాజాగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పంపులు, మోటార్లను సరఫరా చేస్తున్న బీహెచ్‌ఈఎల్‌ సైతం పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కేంద్రం గెజిట్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వీటికి అనుమతులు వస్తాయా? అనుమతులు వచ్చేంతవరకూ పనులు నిలిపివేయాలా? ఒకవేళ పంపులు, మోటార్లు సరఫరా చేస్తే చెల్లింపులు యధావిధిగా కొనసాగుతాయా? అనే ప్రశ్నలకు వివరణ కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు