స్టీల్‌ బ్రిడ్జి.. నగరానికే తలమానికం

5 Mar, 2023 05:22 IST|Sakshi
స్టీల్‌ బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఉన్నతాధికారులు

పనులను పరిశీలించిన కేటీఆర్‌

నత్తనడకన సాగడంపై అసంతృప్తి

జూన్‌ 2లోగా పూర్తి చేయాలని ఆదేశం

ముషీరాబాద్‌: ఇందిరా పార్కు నుంచి వీఎస్‌టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్‌ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2వ తేదీలోపు  పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్‌ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్‌టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్‌ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్‌ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

రిటైనింగ్‌ వాల్‌ పనుల పరిశీలన..
స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్‌ నాలా రిటైనింగ్‌ వాల్‌ పనులను మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్‌ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్‌ వాల్‌ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.  అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.  

చేపల మార్కెట్‌ కోసం డిజైన్‌ రూపొందించండి..
దేశంలోనే ఫ్రెష్‌ ఫిష్‌ మార్కెట్‌ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్‌ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్‌ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్‌ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్‌సీలు శ్రీధర్, జియావుద్దీన్‌ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు