రండి.. పెట్టుబడులు పెట్టండి..తెలంగాణకు తొలి ప్రాధాన్యమివ్వండి

19 May, 2022 01:40 IST|Sakshi
లండన్‌లో జరిగిన యూకే–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌

భారత్‌లో తెలంగాణకు తొలి ప్రాధాన్యమివ్వండి 

భూమి, నీళ్లు, విద్యుత్‌.. కావాల్సినవన్నీ ఉన్నాయ్‌ 

యూకే ఐబీసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, విధానాలు, ప్రోత్సాహకాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీళ్లు, విద్యుత్‌తో పాటు నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం కోసం యూకేలో పర్యటిస్తున్న మంత్రి.. తొలిరోజు యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో  పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను.. రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా వచ్చే ప్రయోజనాలను వివరించారు. టీఎస్‌ ఐపాస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బ్యాంకింగ్‌ ఫైనాన్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫార్మా–లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పేస్,  డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడుల కోసం తెచ్చిన పాలసీలను వివరించారు. భారత్‌లో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్‌ ఉందని, ఈ మేరకు అనేకసార్లు అవార్డులను అందుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో ఇతర నగరాల్లో లేని కాస్మోపాలిటిన్‌ కల్చర్‌ హైదరాబాద్‌లో ఉందని వివరించారు. ఐటీతో పాటు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాలకు హబ్‌గా మారిందని తెలిపారు. అనేక మల్టీనేషనల్‌ కంపెనీలు అమెరికా ఆవల తమ కార్యాలయాలను ఇండియాలో హైదరాబాద్‌లోనే ఏర్పాటుచే శాయని గుర్తుచేశారు. డెలాయిట్, హెచ్‌ఎస్‌బీసీ, జేసీబీ, రోల్స్‌ రాయిస్‌ వంటి కంపెనీలు సమావేశాల్లో పాల్గొన్నాయి. 

బయో ఆసియా సదస్సుకు రండి.. బ్రిటన్‌ మంత్రికి కేటీఆర్‌ ఆహ్వానం 
రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఆసియా సదస్సులో పాల్గొనాల్సిందిగా బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి రనిల్‌ జయవర్ధనకు కేటీఆర్‌ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీఎస్‌–ఐపాస్‌ విధానం గురించి వివరించగా ఈ విధానాన్ని బ్రిటన్‌ మంత్రి ప్రశంసించారు. రాష్ట్రానికి రావాలన్న మంత్రి ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు.  

మరిన్ని వార్తలు