భిన్నత్వంలో ఏకత్వమే మా లక్ష్యం

18 Sep, 2022 03:12 IST|Sakshi
సిరిసిల్ల కలెక్టరేట్‌లో సాయుధ పోరాట యోధులను సన్మానిస్తున్న కేటీఆర్‌

అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే తెలంగాణ దిక్సూచి 

సిరిసిల్లలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో మంత్రి కేటీఆర్‌

సాక్షి, సిరిసిల్ల: భిన్నత్వంలో ఏకత్వం తమ లక్ష్యమని, అరవైఏళ్ల స్వీయ అస్తిత్వ పోరాటం తర్వాత అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్‌ 17వ తేదీ.. తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు పరివర్తన చెందిన రోజన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్త్‌ ప్రొఫైల్‌ను ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టామని వివరించారు.అంబేడ్కర్‌ పేరును రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టి మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో కొందరు మత పిచ్చితో మంటలు రేపాలని చూస్తున్నారని, మన మధ్య ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా

మరిన్ని వార్తలు