విద్య, సామాజిక న్యాయానికే పోరు యాత్ర 

3 Dec, 2022 00:53 IST|Sakshi
శ్రీకాంతాచారి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు పూలమాల వేసి పోరుయాత్రను ప్రారంభిస్తున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

మన్సూరాబాద్‌: చదువు, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్రను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పాలమూరు నుంచి పట్నం వరకు చేపడుతున్న పోరుయాత్రను శుక్రవారం ఎల్‌బీనగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, కాసోజు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు.

అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం మళ్లీ రోడ్డు ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు తెలంగాణ సర్కార్‌ భరోసా కల్పించడంలో విఫలమైందని, బీసీ విద్యార్థులపై కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ సర్కారు ఇతర వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసి, బీసీ విద్యార్థులకు మూడేళ్లయినా విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌ ఫీజులను పెంచిందని, కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా బీసీ విద్యార్థులపై భారం వేసిందని విమర్శించారు. అన్ని జిల్లాల్లో జనవరి 8 వరకు యాత్ర సాగుతుందని జాజుల పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు