ప్రాంతీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి

29 Apr, 2022 02:30 IST|Sakshi
గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

బీజేపీని ఓడించే వ్యూహం ఖరారుకు సమావేశం కావాలి 

సీఎం కేసీఆర్‌తో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ గురువారం రాత్రి ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య దేశ రాజకీయాలు, వర్తమాన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని, దీనికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి త్వరలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాల్సిన అవసరముందని ఇరువురు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి, ఎన్నికల్లో లబ్ధిపొందడానికి రాష్ట్రాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నాలు, మత ఘర్షణలతో పెట్టుబడుల రాకపై పడే దుష్ప్రభావాలు, విపక్షాలపై కక్ష సాధింపు కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి విభాగాల దుర్వినియోగం, గవర్నర్లు సృష్టిస్తున్న ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. 

మూడు రోజులు ఇక్కడే...
తల్లి వైద్యం కోసం గురువారం రాష్ట్రానికి చేరుకున్న హేమంత్‌ సోరెన్‌ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు. రాష్ట్ర అతిథిగా ఆయనకు నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి శనివారం తిరిగి రానున్నారు. శనివారం రాత్రి ఇక్కడే హోటల్లోనే బస చేస్తారు. ఆదివారం సోరెన్‌ రాంచీకి తిరిగి వెళ్లే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు