వారంలోగా కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

19 Apr, 2022 02:23 IST|Sakshi
లబ్ధిదారులకు పంపిణీ చేసిన వాహనాన్ని నడుపుతున్న మంత్రి హరీశ్‌రావు 

సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు 

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో పోలీస్, ఫైర్, ఫారెస్టు, ఎక్సైజ్‌ శాఖలకు సంబంధించి 20 వేల ఉద్యోగాలకు వారంరోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు 16 అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. పలు సమీక్షల్లో పాల్గొన్నారు. పోలీస్‌ శాఖ ఇక్కడ ఏర్పాటు చేసిన కానిస్టేబుల్‌ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జాబ్‌ కేలండర్‌ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ‘‘దళితుల ఆర్థిక అభ్యున్నతికి దళితబంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ఇది అమలైతదంటవా? రూ.పది లక్షలు ఇస్తరంటవా? అనే కాంగ్రెస్, బీజేపీ అపశకునం గాళ్లకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారు. మీ విమర్శలను దీవెనలనుకుంటాం. మరింత చిత్తశుద్ధితో ముందుకెళ్తాం’’అంటూ మంత్రి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

‘బండి సంజయ్‌.. నీ తొండి మాటలు బంద్‌ చెయ్యి’అని అక్కాచెల్లెల్లు అడ్డం తిరిగారటా.. సిలిండర్‌ ధర రూ.1,050 చేసినవు.. ఆ ధర ఎప్పుడు తగ్గిస్తావో చెప్పు అని గట్టిగా అడిగారట.. నిరుద్యోగ యువత దేశంలో ఉన్న 15.60 లక్షల ఉద్యోగాలెప్పుడిస్తరో చెప్పు అని నిలదీశారట’’అని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, సిలిండర్‌ ధరలను పెంచి తొండి పనులు చేస్తూ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ‘కాంగ్రెసోళ్లది దింపుడుగల్లం ఆశ. వాళ్లది వాళ్లకే సుతిలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటున్నారు’అని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు