హే.. సూర్య ‘భగ’వాన్‌!

4 May, 2022 02:23 IST|Sakshi

6, 7 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్‌ అధికంగా నమోదవుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మంగళవారం మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో మినహా మిగతా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.

ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్‌ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు