వామ్మో ‘జూన్‌’.. తలుచుకుంటే వణుకు పుడుతోంది!

6 Jun, 2022 10:06 IST|Sakshi

‘సాగు’డెలా.. చదివేదెలా..?

ఈ నెలలోనే స్కూళ్లు, వానాకాలం సీజన్‌ ప్రారంభం

డబ్బుల కోసం పేద, మధ్య తరగతి ప్రజల తండ్లాట

పెరిగిపోతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్న జనం

పుస్తకాలు మొదలు బ్యాగు, పెన్ను, పెన్సిల్‌ వరకు అన్నీ పిరమే

ఎరువులు, విత్తనాలకు రైతుల తంటాలు

‘జూన్‌ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జిల్లాలోని ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాం, పెన్నులు, పెన్సిల్‌ ఇతరాత్ర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వానాకాలం సీజన్‌ మొదలవ్వడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈనెల ఎలా గట్టేక్కుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.’

సాక్షి,కరీంనగర్‌: పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. ఈ నెల 12 నుంచి కొత్తవిద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా అడ్మిషన్‌ తీసుకునేవారు ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్‌ ఫీజులు చూసి జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ‘వామ్మో జూన్‌’ అంటూ తలపట్టుకుంటున్నారు. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏయే స్కూల్‌లో ఏ స్థాయి ఫలితాలు వచ్చాయి, తదితర అంశాలపై తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు. 

అప్పు చేసైనా పైసలున్న బడికి..
జిల్లావ్యాప్తంగా సుమారు 600 పైగా ప్రైవేట్‌ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్‌ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. కొన్ని పాఠశాలలైతే నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్‌ స్కూల్‌ అనేది వేళ్లూనుకోవడంతో దిగువ, మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. 

రైతులకు ఖరీఫ్‌ భారం
ఏటా రైతులకు వానాకాలం సీజన్‌ భారంగా మారుతోంది. ఈ యాసంగి పంటలు పండినా ధా న్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉ న్నారు. వ్యవసాయ పనులూ అంతంతే. ఇతరత్రా కూలీ పనులు దొరక్క గ్రామీణులుæ ఉపాధి పనుల కు వెళ్లినా కొద్ది రోజులుగా డబ్బులు అందక వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ఉపాధి పనులకు వెళ్తే రూ.200 నుంచి రూ. 250 వరకు దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీ ఫ్‌నకు సంబంధించి ఎరువులు, విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువు, వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి!

   

మరిన్ని వార్తలు