న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదు 

20 Dec, 2021 01:40 IST|Sakshi

జై భీం రియల్‌ హీరో జస్టిస్‌ చంద్రు వ్యాఖ్య 

‘నేర్చుకో.. బోధించు.. పోరాడు..’ను గుర్తుంచుకోవాలని హితవు

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదని.. నాణేనికి బొమ్మాబొరుసులాంటివని జై భీమ్‌ రియల్‌ హీరో జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విధ్వంసమవుతున్న ప్రజాస్వామ్య పునాదులు – పరిష్కార మార్గాలు’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అప్పట్లో బ్రిటీష్‌ పాలకులకు నేరాలు జరిగిన సమయంలో నేరస్థులను పట్టుకోవడం చేతకాలేదని, సులభంగా కేసులను మూసేందుకు వీలుగా కొన్ని సామాజిక తెగలను నేరస్థ తెగలుగా గుర్తిస్తూ వచ్చారని వెల్లడించారు.

ఆ మేరకు చట్టం చేశారని, స్వాతంత్య్రం వచ్చాక కూడా అది  కొనసాగిందని, కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగా ఆ చట్టం రద్దయిందని పేర్కొన్నారు. ఆ తెగలను డీ నోటిఫైడ్‌ చేసినా.. ఇప్పటికీ వారికి ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదని తెలిపారు. కమ్యూనిస్టులు చూపించే విముక్తి మార్గమే శాశ్వతమైందన్నారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్క ర్‌ చెప్పినట్లుగా ‘నేర్చుకో.. బోధించు.. పోరాడు’ను గుర్తుంచుకోవాలన్నారు.

తాము యూనియన్లతో సంప్రదింపులు జరపమంటూ ముఖ్యమంత్రులు భీష్మించుకు కూర్చోడానికి వీల్లేదని జస్టిస్‌ చంద్రు చెప్పారు. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిన నాటి తమిళనాడు సీఎం జయలలిత, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ మొండికేసిన సందర్భాలను ఉటంకించారు. సెన్సార్‌ బోర్డులన్నీ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వ్యక్తులతో నిండిపోయాయన్నారు. జైభీమ్‌ సినిమాలో చూపించిన హింస వాస్తవంగా జరిగిన దాంట్లో 10 శాతం మాత్రమేనన్నారు.

చదువుతోపాటు ధైర్యముండాలి... 
వ్యవస్థలో మార్పు కోసం పోరాడేందుకు చదువుకుంటేనే సరిపోదని, ధైర్యం కూడా ఉండాలని జస్టిస్‌ చంద్రు సూచించారు. సమ్మె చేశారనే కారణంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తే, వారంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు.

కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే, వారిలో ఒక్కరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ముందుకు రాలేదని తెలిపారు. జై భీమ్‌ సినిమాలో చూపించినట్లు రాజుకన్న భార్య పోలీసుల ప్రలోభాలకు లొంగకుండా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసి న్యాయవ్యవస్థను కదిలించిందని గుర్తుచేశారు.

జైభీమ్‌ సినిమా లోని జస్టిస్‌ మిశ్రా న్యాయవ్యవస్థ పనితీరును మానవీయంగా కొత్తమార్గం పట్టించారని కొనియాడారు. 1990లో చిదంబరంలో లైంగిక దాడికి గురైన మహిళ వామపక్ష పార్టీల సహకారంతో న్యాయంకోసం పోరాడగలిగిందనీ, అది మొదలు మిశ్రా అనేక కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు కట్టుబడ్డారని తెలిపారు.

పరిహారం ఇచ్చే ప్రొవిజన్‌ లేకపోయినా... గౌరవనీయ పరిహారం ఇప్పించారన్నారు. భారత్‌లో మూడు గ్రామాలవ్యవస్థ ఉందని.. ఒకటి కాలనీ అని, మరొకటి షెడ్యూల్డ్‌ కులాల నివసించే ప్రాంతమని, మూడో నివాస ప్రాంతం ఆదివాసీలు ఉండేదని పేర్కొన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకం జనవరిలో విడుదల చేయనున్నట్లు జస్టిస్‌ చంద్రు వివరించారు.    

మరిన్ని వార్తలు