Rythu Bandhu: రైతుబంధుకు మరో అవకాశం.. కరీంనగర్‌ రైతులకు జనవరి 7 వరకు చాన్స్‌

24 Dec, 2022 12:12 IST|Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: యాసంగి రైతుబంధు కింద ప్రభుత్వం సాయం అందిస్తోంది. పలు జిల్లాల్లో పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాగా కరీంనగర్‌ జిల్లాలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. భూక్రయవిక్రయాల నేపథ్యంలో రోజురోజుకూ పట్టాదారులు మారుతుండగా మళ్లీ మళ్లీ చాన్స్‌ ఇస్తోంది. యాసంగి పెట్టుబడి సాయం పొందేందుకు కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతీ అన్నదాతకు పెట్టుబడి సాయం అందనుంది. అలాంటి వారి వివరాలపై క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మొత్తం 1,72,877 మంది రైతులు గుర్తించగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పాసుపుస్తకాలున్నా నమోదు కాలేదు
జిల్లాలో చాలామంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన గడువులోగా సంబంధిత బ్యాంకు పాసుపుస్తకంతో ఇతర జిరాక్స్‌లు ఇవ్వకపోవడం వల్ల ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఫలితంగా పెట్టుబడి సాయం అందుకోలేకపోయారు. కొంతమంది గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు కాలేదు. 

సమస్య ఉంటే ఏఈవోను కలవాలి
రైతుబంధు సాయం పొందేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశవిుచి్చంది. డిసెంబర్‌ 20, 2022 వరకు ఆన్‌లైన్‌లో నమోదైన వారందరి ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. జనవరి 7 వరకు దరఖాస్తుకు మరో చాన్స్‌ ఇవ్వగా వ్యవసాయ అధికారులు రైతులకు సమాచారం ఇస్తున్నారు. గత సీజన్లలో డబ్బులు జమ అయ్యి, ఈ సీజన్‌లో అసలే రాకపోయినా లేదా ఉన్న భూ విస్తీర్ణం కంటే తక్కువ భూమికి మాత్రమే డబ్బు జమ అయినా రైతుబంధు పోర్టల్‌లో పేరు కనిపించి, బ్యాంకు ఖాతా వివరాలు ఇప్పటికీ ఇవ్వకపోయినా, బ్యాంకు వివరాలు తప్పుగా నమోదు కావడం, ఏ ఇతర కారణాల వల్ల డీబీటీ ఫెయిల్‌ అని మీకు సందేశం వచ్చినా వెంటనే దరఖాస్తుతోపాటు స్వయంగా పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లతో ఏఈవోను సంప్రదించాలి. 

వాళ్లు రైతులా.. బినావీులా?
ప్రభుత్వ సాయమంటే ఎవరైనా ముందుకు వస్తారు. ఎకరాన రూ.5 వేలిస్తుండగా ఏటా రూ.6 కోట్ల వరకు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుండటం అనుమానాలకు తావిస్తోంది. మూడేళ్ల క్రితం పెట్టుబడి సాయం పథకం ప్రారంభం కాగా మొదటి నుంచీ 2500 మందికి పైగా ప్రభుత్వ సాయానికి దూరంగా ఉంటున్నారు. వివరాలివ్వాలని వ్యవసాయ శాఖ విçస్తృత ప్రచారం చేస్తున్నా పెడచెవిన పెడుతుండటం విడ్డూరం. వారంతా బినావీులా, సంపన్నులా అన్నది సస్పెన్స్‌. చొప్పదండి మండలంలో 195, గంగాధరలో 161, రామడుగులో 158, ఇల్లందకుంటలో 102, హుజూరాబాద్‌లో 146, జమ్మికుంటలో 147, సైదాపూర్‌లో 126, వీణవంకలో 138, కరీంనగర్‌ అర్బన్‌లో 1, కరీంనగర్‌ రూరల్‌లో 115, కొత్తపల్లిలో 118, చిగురుమామిడిలో 131, గన్నేరువరంలో 70, మానకొండూరులో 157, శంకరపట్నంలో 596, తిమ్మాపూర్‌ మండలంలో 139 మంది ఇలాంటి వారున్నారు.

పథకానికి దూరమవడానికి కారణాలు..

ప్రాజెక్టులకు సేకరించిన భూములను పెండింగ్‌లో పెట్టడం.
ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాల నంబర్లు తప్పుగా ఉండటం.
కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ వాటిపై ఆంక్షలు విధించడం.
ఒకే సర్వే నంబర్‌తో రెండు పాసుపుస్తకాలు ఉండటం.
భూములు విక్రయించడం వల్ల కొనుగోలు చేసిన రైతుల పట్టా పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉండటం.
కొందరు రైతులు మృతిచెందడం వల్ల వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం.

జిల్లాలో రైతుబంధు గణాంకాలిలా..
పోర్టల్‌లో నమోదైన రైతులు - 1,97,097
బ్యాంకు ఖాతా,  వివరాలిచ్చిన రైతులు - 1,79,599
గత వానాకాలంలో పెట్టుబడి సాయం పొందిన రైతులు - 1,64,197
ఖాతా వివరాలివ్వాల్సిన వారు - 6,191
బ్యాంకు ఖాతా సమస్య ఉన్నవారు - 881
సరిచేయాల్సినవి - 134
చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

మరిన్ని వార్తలు