అంతర్జాతీయ విత్తన సంస్థ అధ్యక్షుడిగా కేశవులు

13 May, 2022 03:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, విత్తన శాస్త్రవేత్త డాక్టర్‌ కేశవులు ఎన్నికయ్యారు. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో గురువారం ఇస్టా కాంగ్రెస్‌ ముగింపు సందర్భంగా ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఇస్టా కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించింది. కేశవులు 2025 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.

అమెరికాకు చెందిన ఎర్నెస్ట్‌ ఎలాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, మరో తొమ్మిది మంది ఇస్టా సభ్యులుగా ఎన్నికయ్యారు. సభ్యుల్లో కెనడా, న్యూజి లాండ్, ఫ్రాన్స్, ఫిలిఫ్పైన్స్, అర్జెంటీనా, జర్మనీ, జింబాబ్వే, ఇటలీ, ఉరుగ్వేలకు చెందినవారున్నారు. కాగా, కేశవులుకు ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

దేశానికి తెలంగాణ విత్తన భాండాగారంగా ఉన్న నేపథ్యం లో ఆసియా నుంచి తొలిసారిగా ఈ పదవికి ఎన్నికైన వ్యక్తి కేశవులు అని కేటీఆర్‌ వ్యా ఖ్యానించారు. తెలంగాణ నుంచి ఎంపిక కావడంతో యావత్‌ భారతావనికి కూడా విత్తన రంగంలో అంతర్జాతీయ కీర్తి లభించిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కేశవులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో విత్తన పరీక్ష ల్యాబ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.  భారత వ్యవసాయోత్పత్తి ప్రతి ఏడాది స్థిరంగా పెరుగుతూ వస్తోందని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కైరోలో జరి గిన ఇస్టా కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ ఇస్టా వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయన్నారు.  

మరిన్ని వార్తలు