వైరల్‌ ఆడియో: డాడీ.. మంచి ఒక ముచ్చట జెప్పవే! ఇంతకీ పోరడు ఇంటికి జేరిండా?

30 Sep, 2022 21:28 IST|Sakshi

బహుశా.. ఆ పోరడు సంబురంగా ఇంటికి చేరే ఉంటడు. మధ్యల ఆగి షాపుల కొత్త బట్టలు కొనుక్కునే ఉంటడు. ముక్కవాసనొచ్చే దుప్పట్లు, ఇడిసిన బట్టలు ఉతికించుకుని కూడా ఉంటడు. అట్లే.. అమ్మ చేసిన గారెలు, కారప్పుస తింటూ.. సరదాగా దోస్తులతో ఆడుకుంట.. బాంబులు పేల్చుకుంట.. డాడీ చేతిల తన్నులు వడుకుంట ఉండాలనే కోరుకుందం. ఎందుకంటే ఆ పోరడు అవ్వయ్యలను అంతగా ఒర్రిచ్చిండు కావట్టి.

పండుగలొస్తే సొంత ఊళ్లకు బయలుదేరే జోష్‌లో మునిగిపోతుంటారు అంతా. కానీ, హాస్టల్‌ స్టూడెంట్స్‌కు మాత్రం అవి భావోద్వేగాలతో నిండిన క్షణాలనే చెప్పొచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు వస్తారా? అనే ఎదురుచూపులు వర్ణణాతీతం. అలాంటి పిలగాడి ఆడియో క్లిప్‌ ఒకటి ‘హాస్టల్‌ తిప్పలు’ పేరుతో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

‘‘డాడీ.. నాకు మనసొప్పుతదలేదే..’’ అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఒకటి గత రెండు మూడు రోజులుగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. వాట్సాప్‌ మొదలు.. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఎక్కడ చూసినా ఈ క్లిప్‌ సందడి చేస్తోంది. ‘‘డాడీ.. ఒక మంచి ముచ్చట చెప్పవే.. అన్నీ సర్దుకుని రెడీగా ఉండమంటూ’’ తల్లిదండ్రులు చెప్పాల్సిన మాటలను కూడా తనే చెప్పి.. వాళ్లకు విసుగు తెప్పించాడు ఆ చిన్నారి. అంతేకాదు ఆ తండ్రితో పాటు తల్లి కూడా అతన్ని సముదాయించేందుకు చెప్పిన మాటలు, పదే పదే ఫలానా డేట్‌కు కన్ఫర్మ్‌ వస్తరు కదా అని అడగడం, గిదే లాస్ట్‌ అంటూ చివర్లో ఆ చిన్నారి పలికిన పలుకులు నవ్వులు పూయిస్తున్నాయి. అయితే.. 

అదే సమయంలో ఊపిరి తీయకుండా ఆ చిన్నారి మాట్లాడిన మాటలు, అతనిలోని బాధ-ఆందోళన.. అన్నింటికి మించి సున్నితత్వాన్ని ప్రతిబింబించాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హాస్టల్‌లో ఉంటేనే.. అలాంటి కష్టాలు తెలుస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దసరా సెలవులంటే.. బహుశా ఇది ఈ మధ్య సంభాషణ అయి ఉండొచ్చు. ఆడియో క్లిప్‌ ఉద్దేశం ఏదైనా.. వైరల్‌ మాత్రం విపరీతంగా అయ్యింది. మరి.. అనుకున్నట్లు ఆ తల్లిదండ్రులు ఆ పిలగాడి దగ్గరకు వెళ్లారా? ఇంటికి తీసుకువెళ్లారా? అనే ఆత్రుతతో ప్రశ్నించే వాళ్లే కామెంట్‌ బాక్స్‌లో ఎక్కువైపోయారు. మొత్తానికి ఆ ఫ్యామిలీ ఎవరో.. ఎక్కడుంటారో!.

Video Credits: pranks telugu

మరిన్ని వార్తలు