ఘన సంస్కృతిని ముందుతరాలకు అందిద్దాం 

28 Feb, 2022 01:25 IST|Sakshi
హునార్‌ హాత్‌ ప్రదర్శనలో హస్తకళా ఉత్పత్తులను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి నఖ్వీ. చిత్రంలో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మహమూద్‌ అలీ తదితరులు  

ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘హునార్‌ హాత్‌’ ప్రారంభించిన కిషన్‌రెడ్డి 

కవాడిగూడ: ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం చిరునామాగా ఉందని, ఈ సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందిద్దామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహిస్తున్న హునార్‌ హాత్‌ ప్రదర్శనను ఆదివారం కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో కలిసి జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, మన ప్రాచీన వారసత్వాన్ని హునార్‌ హాత్‌లో చూసుకోవచ్చని తెలిపారు.

కరోనాతో చిన్న కళాకారులు బాగా నష్టపోయారని, వారికి ఆర్థిక సహాయం అందజేసేందుకు హునార్‌ హాత్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని 75 ప్రధాన నగరాల్లో హునార్‌ హాత్‌ను ఏర్పాటు చేశారని, ఈ ప్రదర్శనను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రజలు దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ఆదుకోవాలని సూచించారు. ఆయారంగాల్లో గుర్తింపుపొందిన దేశవ్యాప్త కళాకారుల చేత ప్రదర్శనలు చేపట్టడం అభినందనీయమన్నారు.

ఏప్రిల్‌ 1, 2, 3 తేదీలలో ఎన్‌టీఆర్‌ స్టేడియంలో అఖిలభారత సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి నఖ్వీ మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్యంలో చేతి వృత్తులు, కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు మిషన్‌ మోడ్‌పై కృషిచేయడం ప్రారంభించిందన్నారు. తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్తకళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్థానిక కార్పొరేటర్‌ రచనశ్రీ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు