‘కోకాపేట’కు కోట్లకు కోట్లు: ఒక్క ఎకరం రూ.60 కోట్లు

16 Jul, 2021 01:37 IST|Sakshi

కోకాపేట భూముల వేలంలో సరికొత్త రికార్డు

ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల ఆదాయం

1.65 ఎకరాల ‘గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టు’ ప్లాట్‌ను

ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున రూ.99.33 కోట్లకు దక్కించుకున్న ‘రాజపుష్ప రియాల్టీ’ 

అతి తక్కువగా ఎకరం రూ.31 కోట్లు పలికిన

ప్లాట్‌ ‘ఏ’ భూమి.. మొత్తం 49.94 ఎకరాల వేలం.. ఒక్కో ఎకరం సగటు ధర రూ.40.5 కోట్లు

దేశ విదేశాల నుంచి 60 మంది బిడ్డర్లు హాజరు

​​​​​​సాక్షి, హైదరాబాద్‌: కోకాపేటలోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కోకాపేటలోని 49.949 ఎకరాల భూములకు ఆన్‌లైన్‌ ద్వారా వేలం నిర్వహించగా, ఓ ప్లాట్‌లో ఎకరం ఏకంగా రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్‌ ధర పలికింది. అతి తక్కువ ధర రూ.31.2 కోట్లుగా నమోదైంది. మొత్తం 49.949 ఎకరాలకుగాను, ఒక్కో ఎకరం సగటున రూ.40.05 కోట్ల ధరకు అమ్ముడు బోయింది. ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధర (అప్‌సెట్‌ ప్రైస్‌)ను ఖరారు చేయగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే భారీ ధరలతో ప్లాట్లు అమ్ముడుబో యాయి. ఈ ప్లాట్లన్నీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా కోకాపేట హాట్‌కేక్‌ అనే విషయం ఈ వేలం స్పష్టం చేసింది.

అప్పుడు మిగిలిపోయిన ప్లాట్‌
కోకాపేట భూములకు హెచ్‌ఎండీఏ గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ వేదికగా ఈ–వేలం నిర్వహించింది. ఇందులో ఏడు ప్లాట్లు నియోపోలీస్‌ లేఅవుట్‌వి కాగా ఒక ప్లాట్‌ గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టుకు సంబంధించినది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30.778 ఎకరాలతో కూడిన 4 ప్లాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన 19.171 ఎకరాల 4 ప్లాట్లకు వేలం జరిగింది. గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టుకు చెందిన ‘2/పీ వెస్ట్‌ పార్ట్‌’ ప్లాట్‌ నంబర్‌లో 1.65 ఎకరాలుండగా, ఎకరానికి రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్‌ ధరను కోట్‌ చేసి, మొత్తం రూ.99.33 కోట్ల ధరతో ‘రాజపుష్ప రియాల్టీ ఎల్‌ఎల్‌పీ’ అనే స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆ ప్లాట్‌ను దక్కించుకుంది. గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టు పేరుతో 2007లో నాటి ప్రభుత్వం కోకాపేటలోని ప్రభుత్వ భూములకు వేలం నిర్వహించగా, అప్పట్లో మిగిలిపోయిన ఈ ప్లాట్‌కు తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకడం గమనార్హం. వేలంలో ఎకరాకు రూ.31.2 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్‌ ధరతో ప్లాట్‌ నంబర్‌–‘ఏ’ లోని ఎకరం భూమిని హైమ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. కనీస బిడ్డింగ్‌ ఇంక్రిమెంట్‌ ధర ఎకరానికి రూ.20 లక్షల లెక్కన బిడ్డర్లు భూముల ధరలు పెంచుతూ పోయారు.

ఆలస్యమైనా కాసుల వర్షం
హెచ్‌ఎండీఏకు కోకాపేటలో ఉన్న 634 ఎకరాల్లో 167 ఎకరాలను గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలను, ఎంపైర్‌–1, ఎంపైర్‌–2 పేరుతో 67 ఎకరాలను 2007లో వేలం ద్వారా విక్రయించారు. అప్పుడు కూడా ఎకరానికి అత్యధికంగా రూ.14.25 కోట్ల ధర పలికింది. అయితే ఈ భూముల విషయంలో వివాదం నెలకొని చాలా ఏళ్ల పాటు సాగింది. 2017లో కోకాపేటలోని భూములన్నీ హెచ్‌ఎండీఏవేనని, వాటిని విక్రయించే హక్కు దానికే ఉందని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో వివాదం సమసింది. అయితే 2007లో వేలం వేసిన 167 ఎకరాలు పోనూ ఐటీ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌కు 110 ఎకరాలు, వివిధ కులసంఘాలకు 55 ఎకరాలు కేటాయించారు. మిగిలిన దాదాపు 300 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేసిన సువిశాల రోడ్లు పోనూ మిగిలిన 110 ఎకరాల్లో.. తాజాగా 49.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయించారు. కోర్టు వివాదంతో ఇన్నాళ్లూ ఆలస్యమైనా భారీగా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు అంటున్నారు.

ఎప్పటికప్పుడు సీఎంవోకు..
కోకాపేట భూముల ఆన్‌లైన్‌ వేలానికి వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు తెలుసుకుంది. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఎంఎస్‌టీసీ-ఈ కామర్స్‌ టెక్నికల్‌ విభాగ సిబ్బంది నిర్వహించిన ఈ ప్రక్రియను సంస్థ కమిషనర్, పురపాలక శా>ఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ పర్యవేక్షించారు. వేలానికి వచ్చిన స్పందనను ఎప్పటికప్పుడు సీఎంవోకు నివేదించారు. కోకాపేట భూములను వేలంలో దక్కించుకోవడానికి దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలతో పాటు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపారు. పెట్టుబడులకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌ నగరంలో స్థిరాస్తి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తాజాగా నిర్వహించిన కోకాపేట భూముల వేలం రుజువు చేసింది. దాదాపు 60 మంది బిడ్డర్లు దేశ విదేశాల నుంచి ఈ వేలంలో పాల్గొన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు