అంబేడ్కర్‌ స్మృతివనాన్ని అపవిత్రం చేశారు 

7 Feb, 2022 02:15 IST|Sakshi

బండి సంజయ్‌ సందర్శనపై మంత్రి కొప్పుల  

ఏడాది ఆఖరులోగా బాబాసాహెబ్‌ విగ్రహం ఏర్పాటవుతుందని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని (125 అడుగులు) నిర్మించే ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సందర్శించి అపవిత్రం చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. దళిత వ్యతిరేక విధానంతో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న అగ్రవర్ణాల పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. అంబేడ్కర్‌ స్మృతివనాన్ని సంజయ్‌ సందర్శించి వెళ్లాక పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేశ్, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నారదాసు లక్ష్మణ్‌ రావులతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లాడారు.

ఒకవైపు 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణ దశలో ఉంటే ఇక్కడికి వచ్చి తలతోక లేకుండా సంజయ్‌ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది ఆఖరులోగా అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు లైబ్రరీని ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై కేసులు పెరిగాయన్నారు. ‘రాష్ట్రంలో ప్రతి దళితుడి గుండెచప్పుడు కేసీఆర్‌.

దళితబంధు పథకంతో 15 లక్షల దళిత కుటుంబాల దారిద్య్రాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తున్నారు’అని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించిన చరిత్ర బీజేపీదని వెంకటేశ్‌ నేత విమర్శించారు. ఎంపీలు అరవింద్, రవికిషన్‌ (గోరఖ్‌పూర్‌) దళితులను అవమానపరుస్తూ మాట్లాడారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ పేరెత్తే అర్హత సంజయ్‌కు లేదన్నారు. దేశంలో దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు.   

మరిన్ని వార్తలు