కృష్ణా, గోదావరి బోర్డుల దూకుడు

3 Aug, 2021 03:26 IST|Sakshi

నేడు గోదావరి, కృష్ణా బోర్డుల భేటీ

పూర్తి బోర్డు భేటీ తర్వాతే నిర్వహించాలని తెలంగాణ లేఖ రాసినా వెనక్కి తగ్గని వైనం

ప్రాజెక్టుల అనుమతులు, నిధులు, ఇతర అంశాల అమలుపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. గత నెల 29న సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి బోర్డు కమిటీ భేటీని మంగళవారం నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే దీనిపై సోమవారం తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది.

బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. ‘గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగుణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలి’ అని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తున్నామని వెల్లడించింది.

కృష్ణా బోర్డు సైతం...
గోదావరి బోర్డు మాదిరిగానే కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. ఆ వెంటనే గోదావరి బోర్డు కమిటీతోపాటే ఉమ్మడి కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీ ఉంటుందని సాయంత్రానికి మరో లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు హైదరాబాద్‌ జలసౌధలో ఉమ్మడి భేటీ జరగనుంది. అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డులకు ఇవ్వాల్సిన నిధులు, సీఐఎస్‌ఎఫ్‌ భద్రత, విద్యుదుత్పత్తి విషయమై గెజిట్‌లో పేర్కొన్నట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే భేటీకి తెలంగాణ ఇంజనీర్లు హాజరవుతారా? అన్నది మంగళవారం ఉదయానికే స్పష్టత రానుంది. ఏపీ ఇంజనీర్లు మాత్రం హాజరవుతారని చెబుతున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు