23న కృష్ణాబోర్డు ఆర్‌ఎంసీ సమావేశం 

20 Aug, 2022 00:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధి విధానాలను రూపొందించడానికి కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ (రిజర్వాయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) ఈనెల 23న ఉద యం 11 గంటలకు బోర్డు కార్యాలయంలో సమావేశం కానుంది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయడానికి సంబంధించిన నియమావళి (రూల్‌ కర్వ్‌), విద్యుదుత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి.. కృష్ణా బోర్డుకు పంపనుంది.

బోర్డు ఆమోదముద్ర వేశాక, ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను బోర్డు నిర్వహించనుంది. ఇక 2022–23 సంవత్సరంలో కృష్ణా జలాల లభ్యత, వాటాలు, వినియోగంపై చర్చించడానికి బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఈనెల 23న మధ్యాహ్నం 3.30కు త్రిసభ్య కమిటీ సమావేశమవుతోంది. ఈ సమావేశాలకు హాజరుకావాలని 2 రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు లేఖలు రాసింది.   

మరిన్ని వార్తలు