బీసీలు రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి

16 Feb, 2022 03:07 IST|Sakshi

కాచిగూడ: బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ చైతన్య శిక్షణాతరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ... పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

బీసీల నాయకత్వం పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే దేశంలో బీసీల తిరుగుబాటు మొదలవుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జన గణనలో కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని అన్నారు. ఆర్‌.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, లాల్‌ కృష్ణ, కోల జనార్ధన్, నీల వెంకటేష్, మట్టా జయంతి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు